లాస్ఏంజెల్స్ కు స్లమ్ డాగ్స్
ముంబైః ప్రపంచవ వ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రదానం ఈ ఆదివారంనాడే లాస్ ఏంజెల్స్ లో జరగనుండటంతో అవార్డును ఆశిస్తున్న వారిలో సందడి నెలకొంది. ముంబై నేపథ్యంలో తీసిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రం 11 ఆస్కార్ నామినేషన్లకు ఎంపిక కావడం, అందులో ఎ.ఆర్.రెహమాన్ కు 3 నామినేషన్లు దక్కడంతో ఈసారి మనకు ఆస్కారం తప్పదనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరయ్యేందుకు 'స్లమ్ డాగ్..'లో నటించిన బాలనటులు గురువారం రాత్రి ప్రయాణం కావడంతో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఎంతో సందడి కనిపించింది.
'స్లమ్ డాగ్..'లో చిన్నప్పటి జమాల్ గా నటించిన అయుష్ ఖేడ్కర్, ఎల్డర్ సలీమ్ గా నటించిన మాధుర్ మిట్టల్, టీనేజ్ జమాల్ పాత్రధారి టెనయ్ చ్చెడా, టీనేజ్ సలీమ్ అషుతోష్ గజివాలా, టీనేట్ లతికగా నటించిన తన్వి లోంకర్ లాస్ ఏంజెల్స్ కు బయలుదేరిన వారిలో ఉన్నారు. 'కల నిజమైంది. అకాడమీ అవార్డుల ఫంక్షన్ కు వెళ్తామని కానీ హాలీవుడ్ స్టార్స్ ను కలుసుకుంటామని గానీ ఎప్పుడూ ఊహించలేదు. చిత్ర నిర్మాణ సంస్థ మాకు ఆ అవకాశం కలిపించింది. 6 రోజుల పాటు అక్కడ ఉంటాం. డిస్నీ ల్యాండ్ ట్రిప్ కూడా ఉంటుంది' అని అయుష్ తండ్రి మహేష్ ఖేడ్కర్ తెలిపారు. అషుతోష్ విషయానికి వస్తే, ఇప్పుడు అతను రెండు పరీక్షల్లో విజేతగా నిలవాల్సి ఉందనీ, ఒకటి అవార్డు అయితే మరొకటి మార్చి 2న జరగనున్న ఎస్ఎస్ సి బోర్డ్ పరీక్షలనీ, రెండిట్లోనూ విజేత కావాలని తాము కోరుకుంటున్నామనీ అతని తల్లి లోబో వ్యాఖ్యానించింది. పాస్ పోర్టు, వీసా ఆలస్యంగా రావడం వలన బాలనటులు రుబినా అలీ (యంగెస్ట్ లతిక), అజరుద్దీన్ ఇస్మాయిల్ (యంగెస్ట్ సలీమ్ )లు శుక్రవారంనాడు లాస్ ఏంజెల్స్ బయలుదేరుతున్నారు.
News Posted: 20 February, 2009
|