మల్టీప్లెక్స్ లకు బాలీవుడ్ చెక్!
ముంబైః బాలీవుడ్ నిర్మాతలకూ, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు మధ్య రెవెన్యూ షేర్ విషయంలో తలెత్తిన సమస్య తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది. ఈ మేరకు ఉభయ వర్గాల మధ్యా జరిగిన చర్చలు విఫలం కావడంతో ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఏ మల్టీప్లెక్స్ లోనూ తమ సినిమాను రిలీజ్ చేయరాదని బాలీవుడ్ నిర్మాతల వర్గం నిర్ణయించింది.
ఇరు వర్గాల మధ్యా తలెత్తిన వివాదానికి రెండు ప్రధాన అంశాలు కారణమమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమాను మల్టీప్లెక్స్ లు ప్రదర్శించే సంఖ్యపై పరిమితి విధించాలని నిర్మాతలు కోరుతున్నారు. ఎగ్జిబిటర్ల నుంచి రెవెన్యూ బడ్వాటా విషయంలోనూ నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు. థియేటర్ లో షోల ప్రదర్శన సంఖ్యపై పరిమితి ఉండాలనీ, 6 స్క్రీన్ ల థియేటర్లు గరిష్టంగా 16 నుంచి 18 షోలు, 4 స్క్రీన్ ల థియేటర్లు 12 షోల వరకూ ప్రదర్శించాలంటూ తాము ఇప్పటికే మల్టీప్లెక్స్ లకు లిఖిత పూర్వకంగా తెలియజేశామని ఒక నిర్మాణ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు అర్హమైనవని నిర్మాతల మండలి చైర్మన్ ముఖేష్ భట్ వ్యాఖ్యానించారు. మల్టీ ప్లెక్స్ ల వల్ల వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని తాము కోరుతున్నామనీ ఆయన వివరించారు. దీనికితోడు సినిమా విడుదలైన రెండు వారాల్లోపు తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని కూడా మల్టీప్లెక్స్ లకు నిర్మాతలు, పంపిణీదారులు అల్టిమేటం ఇచ్చినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
News Posted: 21 February, 2009
|