'స్లమ్ డాగ్'కు 800 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో జాక్ పాట్ కొట్టి 8 అవార్డులను ఎగరేసుకుపోయిన 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద డాలర్ల పంట కూడా పండిస్తోంది. సినిమాకు ఖర్చుచేసిన బడ్జెట్ కంటే 10 రెట్లు కలెక్షన్లను ఈ చిత్రం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 163 మిలియన్ డాలర్లు (సుమారు 800 కోట్లు) రాబట్టుకుంది. తాజాగా అకాడమీ అవార్డుల పంట పండటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్మ్ 4, సెలడార్ ఫిలిమ్స్ సంయుక్తంగా 15 మిలియన్ డాలర్ల (సుమారు 75 కోట్లు) వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించింది. గత ఆదివారం నాటికి 800 కోట్ల వరకూ కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టుకుంది. అమెరికాలో ఈ చిత్రం 9.8 కోట్ల డాలర్లు, ఇతర దేశాల్లో 6.5 కోట్ల డాలర్లను ఈ చిత్రం రాబట్టుకుంటుంది.విశ్వవ్యాప్తంగా 20 కోట్ల డాలర్ల వరకూ కలెక్షన్లను రాబట్టుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News Posted: 24 February, 2009
|