ఫ్రిదాకు వుడీ అలెన్ ఛాన్స్
లాస్ ఏంజిలిస్: 'స్లమ్ డాగ్' లతిక హాలివుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధమైపోయింది. ఆమెను బుక్ చేసింది అలాంటిలాంటి వ్యక్తి కాదు. ఒకప్పటి మేటి హాస్య నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వుడీ అలెన్. ఆస్కార్ అవార్డులు అందుకున్న ఆనందం నిషా ఇంకా దిగకముందే, స్లమ్ డాగ్ నటులకు అనూహ్యమైన అవకాశాలు వచ్చి వళ్లో వాలుతున్నాయి హీరో దేవ్ పటేల్ అప్పుడే మనోజ్ నైట్ శ్యామలన్ సినిమా ది లాస్ట్ ఎయిర్ బెండర్ లో విలన్ జెస్సీ మెక్ కార్ట్ ని స్థానాన్ని భర్తీ చేయడానికి కాంట్రాక్టు మీద సంతకం పెట్టేశాడు. ఇప్పుడు ఎడతెరిపి లేని టెలివిజన్ ఇంటర్వ్యూలతో బిజీగా వున్న ఫ్రిదా పింటో మరో అడుగు ముందుకేసి, వుడీ అలెన్ హీరోయిన్ అయిపోతోంది. ఇరవై నాలుగేళ్ల ఈ ముంబాయి అమ్మాయి కెరీర్ లో ఇది అత్యద్భుతమైన బ్రేక్ త్రూ కానుంది. ఆదివారం ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్న అనంతరం ప్రసంగిస్తూ తనకు ఈ అవకాశం కల్పించిన వుడీ అలెన్ కు విశేషంగా ధన్యవాదాలు చెప్పుకుంది పెనెలోప్ క్రజ్.
ఇటీవలి కాలంలో హీరోయిన్లకోసం అత్యుత్తమమైన పాత్రలు తీర్చిదిద్దిన అలెన్, 17 సార్లు నామినేట్ అయి, మూడు సార్లు ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న స్రష్ట. పెనెలోప్ కు ముందు అతడి చిత్రాల్లోనే నటించిన మిరా సొర్వినో(మైటీ అఫ్రొడైట్), డయాన్ వీస్ట్(హన్నా అండ్ హెర్ సిస్టర్స్, బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్ వే), డయాన్ కీటన్(ఏనీ హాల్) ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. వాటేవర్ వర్క్స్ అనే అతడి తదుపరి చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఆ తరువాత అతడు నిర్మించబోయే, ఇంకా పేరు పెట్టని సినిమా జూలైలో సెట్లకు వెళ్లనుంది. దీనిలో నటీ నటులు సర్ ఆంథోని హాప్ కిన్స్, జోష్ బ్రోలిన్, ఫ్రిదా పింటో.
News Posted: 24 February, 2009
|