స్లమ్ డాగ్ సంగీత విభావరి?
లండన్ : అకాడమీ అవార్డులను తుడిచిపెట్టిన ఒక రోజు తరువాత 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రం నిర్మాత క్రిస్టియన్ కోల్సన్ చిత్రంలో నటించిన పిల్లలకు తమంతట తాముగా జీవన పోరాటం సాగించే పరిస్థితి ఎదురు కాకుండా చూడాలని నిశ్చయించుకున్నారు. ముంబై మురికివాడల పిల్లల కోసం నిధులు సమీకరించానికి ఈ చిత్రం సంగీత విభావరిని నిర్వహించాలని నిర్మాతలు యోచిస్తున్నారు.
చిత్రం నిర్మాతలు, దర్శకుడు ఈ పిల్లల కోసం ఏర్పాటు చేసిన నిధికి రూ. 3.6 కోట్ల వరకు సమీకృతమయ్యాయి. ఎ.ఆర్. రెహమాన్ గీతాల కచేరీ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన కార్యరూపం దాలిస్తే ఇప్పటికే సమీకరించిన నిధులు మరింతగా పెరగవచ్చునని కోల్సన్ లండన్ పత్రిక 'ది టైమ్స్' విలేఖరితో చెప్పారు. చిత్ర నిర్మాణం జరిగిన మురికివాడలలో పరిస్థితుల మెరుగుదలకు ఈ నిధులను తిరిగి వినియోగిస్తారు.
మురికివాడల నుంచి వచ్చిన, సంపన్న కుటుంబాలకు చెందిన మరి ఆరుగురు పిల్లలతో కలసి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన పదేళ్ళ అజహరుద్దీన్ మహమ్మద్, తొమ్మిదేళ్ళ రుబీనా ఖురేషి భవిష్యత్తుకు రక్షణ కల్పించేందుకు వ్యూహరచన కూడా జరుగుతున్నది. వారి కోసం 'మరింత పకడ్బందీ ఏర్పాట్లు' చేయాలని నిర్మాతలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 'చిత్రం ప్రొఫైల్ ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. ఈ పిల్లలపై శ్రద్ధ వహించడం తగ్గిపోతుందని మేము భావించలేము' అని కోల్సన్ పేర్కొన్నారు.
పిల్లలు డిస్నీవరల్డ్, యూనివర్శల్ స్టూడియోస్ పర్యటనను కూడా ఎంజాయ్ చేసినట్లు చిత్ర దర్శకుడు డానీ బోయిల్ చెప్పారు. పిల్లలు హోటల్ కు చేరుకోగానే పూర్తిగా దుస్తులతోనే కొలనులోకి దూకారని ఆయన తెలిపారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో చిత్రం సిబ్బందికి లభించిన స్వాగతం చివరకు నిర్మాతలను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఉదాహరణకు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ చిత్రంలో దేవ్ పటేల్ సోదరుని పాత్ర పోషించిన మాధుర్ మిట్టల్ ను కలుసుకుని మాట్లాడారు.
News Posted: 25 February, 2009
|