ఆసిన్,నయనకు కళైమామణి
చెన్నై: ప్రముఖ హీరోయిన్లు ఆసిన్, నయనతార, మీరాజాస్మిన్, శోభనలకు తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'కళైమామణి' 2008 అవార్డులను ప్రకటించింది. కళలు, సాహిత్యరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఏటా ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటుంది. అలనాటి కథానాయిక బి.సరోజాదేవి, ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ , నిర్మాత, థియేటర్ ఓనర్ అభిరామి రామనాథన్ సహా 70 మందికి ఈ అవార్డులను అందజేయనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు భరతనాట్యంలో 'కళైమామణి' లభించింది.
నటుడు భరత్, పశుపతి, నటుడు-దర్శకుడు సుందర్ సి, డ్రమ్స్ శివమణి, దర్శకుడు చేరన్, సినిమాటోగ్రాఫర్ ఆర్.డి.రాజశేఖర్, బుల్లితెర దర్శకుడు సుందర్ కె.విజయన్, తిరుసెల్వం, భరతనాట్య కళాకారులు శైలజ, స్వేతా గోపాలన్, సంగీత కపిలన్, తమిళ సాహిత్య దిగ్గజం అవ్వై నటరాజన్, వోకలిస్ట్ మహారాజపురం శ్రీనివాసన్, ఎ.వి.ఎస్.సుకుమార్, వయోలనిస్ట్ ఎంబర్ కన్నన్, రెలిజియస్ ఆరేటర్ సుకి శివం తదితరులు కూడా ఈ జాతిలో ఉన్నారు. అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని కూడా అందజేస్తారు. గేయరచయిత ఎన్.అస్.వరదరాజన్, టి.సి.సుందరమూర్తి, టి.ఎన్.కృష్ణలకు స్పెషల్ క్యాష్ అవార్డులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ డ్రామా ట్రూప్ గా శ్రీ శంకర నారాయణ సభ ఈ అవార్డుకు ఎంపికైంది.
News Posted: 25 February, 2009
|