'స్లమ్ డాగ్' చిల్డ్రన్ కు ఇళ్లు
ముంబైః ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుచున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో చిన్నారి జమాల్, లతిక పాత్రలు పోషించిన అజరుద్దీన్ మహ్మద్ (10), రూబినా అలీ (9) దశ ఒక్కసారిగా తిరిగింది. వీరికి ఆస్కార్ అవార్డు వరించకున్నా బాధ్యతతో కూడిన సంరక్షణ కల్పించేందుకు అటు చిత్ర నిర్మాత క్రిస్టియన్ కొల్సన్ , ఇటు ముంబై ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వీరిద్దరికీ క్రమబద్ధమైన సంరక్షణ కల్పించాలనీ యోచిస్తున్నామనీ, ముంబైలోని పేద పిల్లలను ఆదుకునేందుకు స్లమ్ డాగ్ ఆధారంగా ఓ స్టేజ్ సంగీత కార్యక్రమం రూపొందించాలని అనుకుంటున్నామనీ కొల్సన్ లండన్ లో మంగళవారం ప్రకటించారు. ఇదే తరుణంలో అజరుద్దీన్, రుబినాలకు తన విచక్షణా కోటా కింద చెరో ఫ్లాట్ ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిర్ణయించారు.
స్లమ్స్ లో నివసించే ఈ ఇద్దరు పిల్లలకు ఇళ్లు కేటాయించాలని ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు క్రిపాశంకర్ సింగ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన మరు నిమిషంలోనే సిఎం అందుకు అంగీకరించారని ఆ పార్టీ సిటీ యూనిట్ ప్రతినిధి కృష్ణ హెగ్డే తెలిపారు. తక్కువ ధరకే ఇళ్లు నిర్మించే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డవలప్ మెంట్ అథారిటీలో హెగ్టే బోర్డు మెంబర్ గా ఉన్నారు. అజరుద్దీన్, రూబినా అలీ ప్రస్తుతం బాంద్రా సబర్బన్ లోని గరీబ్ నగర్ అనే స్లమ్ లొకాలిటీలో నివశిస్తున్నారు.
News Posted: 25 February, 2009
|