దేవ్ చిన్న పిల్లోడు: ఫ్రిదా
మెల్బోర్న్: దేవ్ పటేల్, ఫ్రిదా పింటో గురించి ఇప్పుడు తెలియని వాళ్లెవరూ లేరు. ఉత్తమ చిత్రంతో సహా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంలోని ప్రేమజంటే ఈ దేవ్ అండ్ ఫ్రిదా. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంటూ పలు వదంతులు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. 24 ఏళ్ల ఫ్రిదా తనకంటే చిన్నవాడైన 18 ఏళ్ల దేవ్ ను ప్రేమించడం ఏమిటని కొందరు విమర్శించడమూ జరిగింది. ఈ వదంతులు తన దృష్టికి కూడా రావడంతో ఫ్రిదా భగ్గుమంటోంది. 'దేవ్ కు పట్టుమని 18 ఏళ్లు. అతనింకా చిన్న పిల్లోడే' అని ఫ్రిదా అభివర్ణించింది. డేటింగ్ మాటేమిటి? అనడిగితే 'అబద్ధం. డేటింగ్ ప్రసక్తే లేదు' అని ఆమె తెగేసి చెప్పింది. తమ జంటపై వినిపిస్తున్న ఊహాగానాలను దేవ్ సైతం తోసిపుచ్చారు. 'ప్రేమించుకోవడం, తరచు కలసుకోవడం అనే విషయంలో ఎంత మాత్రం నిజం లేదు' అని వ్యాఖ్యానించారు.
'స్లమ్ డాగ్..' సినిమా లీడ్ పెయిర్ మధ్య ఎదో ఉన్నట్టు వదంతులు వస్తున్నట్టు ఆ చిత్రంలో నటించిన అనిల్ కపూర్ సైతం సూచనప్రాయంగా చెప్పారంటూ 'ది ఏజ్' పత్రిక ఈమధ్య ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇటీవల జరిగిన వాలంటైన్స్ డే సందర్భంగా లండన్ హై స్ట్రీట్ జ్యూయెలరీ స్టోర్ లో రింగ్స్ చూస్తూ ఈ ఇద్దరూ కలిసి కనిపించారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక భగ్నప్రేమికుడైన ఫ్రిదా మాజీ బాయ్ ఫ్రెండ్ అంటావో సైతం 'ఫ్రిదా ఇప్పుడు దేవ్ ఆకర్షణలో పడిపోయింది. వీరి మధ్య శారీరకమైన సంబంధం ఉందా అనేది నాకు తెలియదు. దేవ్ కనుక నాకు ఎదురుపడితే ఏం జరుగుతుందో నేను చెప్పలేను' అంటూ ఆక్రోశం వ్యక్తం చేశాడు. దేవ్ కు దగ్గర కాగానే ఫ్రిదా తనకు చెల్లుచీటీ చెప్పేసిందనీ, దీంతో తన జీవితం అల్లకల్లోలమైందనీ అన్నారు. ఫ్రిదా తన కాలేజీ స్వీట్ హార్ట్ అనీ, 16 నెలల తమ అనుబంధాన్ని ఒక్క టెలిఫోన్ కాల్ తో తెంపేసిందని తెలిపారు. జనవరిలో 'స్లమ్ డాగ్ మిలియనీర్ ' ప్రమోషన్ వర్క్ కోసం ఆమె లాస్ ఏంజెల్స్ లో ఉందనీ, అప్పుడే తనకు ఫోన్ చేసి తనకు చెల్లుచీటీ చెప్పిందని వాపోయారు.
News Posted: 2 March, 2009
|