రెహ్మాన్ కు ఇళయరాజా గిఫ్ట్
చెన్నైః రెండు ఆస్కార్ల విజేత ఎ.ఆర్.రెహమాన్ కు తమిళ సినీ పరిశ్రమకు చెందిన సంగీత దిగ్గజాలు ఘనంగా సన్మానించడం ద్వారా తమ సంఘీభావాన్ని చాటుచుకున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు సినీ మ్యుజిషియన్స్ ఆడిటోరియంలో రెమ్హాన్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడంపై రెహ్మాన్ స్పందిస్తూ, సంగీతంలో నిష్ణాతులైన వారందరి కలలను సాకారం చేస్తూ వారి తరఫున భగవంతుడు తనను ఈ అవార్డుకు ఎంపిక చేశారని అన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు బాటలు వేశారనీ, భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ మరువలేననీ అన్నారు.
'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రానికి తాను మూడు వారాల్లో మ్యూజిక్ కంపోజిషన్ పూర్తి చేశానని చెప్పారు. ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు ఇండియాలో ఉన్నప్పటికీ ఆస్కార్ వరకూ ఎందుకు వెళ్లలేదని తాను అప్పుడప్పుడు ఆశ్చర్యపోయే వాడిననీ, వారికున్న ప్రతిభకు అవార్డులు లెక్కకాదనే విషయం ఆ తర్వాత గ్రహించాననీ అన్నారు. ఈ సందర్భంగా రెహ్మాన్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయరాజా బంగారు గొలుసును బహూకరించారు. హారిస్ జైరాజ్ బంగారు ఉంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. సీనియర్ డైరెక్టర్ కె.బాలచందర్ మాట్లాడుతూ, రెహ్మాన్ ఎంతో ప్రతిభావంతుడనీ, ఇతర సంగీత దర్శకులు తమ సంగీతంతో కోటలు కడితే, రెహ్మాన్ కీర్తి కుడ్యాలు నిర్మించారని ప్రశంసించారు. కె.బాలచందర్ సొంత నిర్మాణ సంస్థ రూపొందించిన 'రోజా' చిత్రంతోనే రెహ్మాన్ పరిశ్రమకు పరిచయం కావడం విశేషం. రెహ్మాన్ సన్మాన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్,బాలమురళీ కృష్ణ, నిర్మాత ఎవిఎం శరవణన్, గాయని ఎస్.జానకి, శంకర్ గణేష్, దేవా, శ్రీకాంత్ దేవా, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, విజయ్ ఆంటోని, డి.ఇమాన్, టి.ఎం.సౌందరరాజన్, ఎల్.ఆర్.ఈశ్వరి, చిన్మయి, టిప్పు, చిత్ర, స్వర్ణలత, మనో, డ్రమ్మర్ శివమణి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 2 March, 2009
|