దక్షిణాది బ్యూటీ ఆసిన్ ఇప్పుడు అమీర్ ఖాన్ సరసన 'గజనీ' చిత్రంలో నటించడం ద్వారా బాలీవుడ్ లో పాగా వేసింది. ఆ చిత్రం ఓవర్సీస్ లోనూ విడుదల కావడంతో అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్ దృష్టిలోనూ పడింది. 'గజనీ' చిత్రం నిర్మాణంలో ఉండగానే సల్మాన్ ఖాన్ సరసన 'లండన్ డ్రీమ్స్' చిత్రంలోనూ అవకాశం వచ్చింది. మార్చిలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వీటికితోడు డిస్నీ పిక్చర్స్ నిర్మించనున్న రెండు చిత్రాల్లోనూ ఆసిన్ కథానాయికగా ఎంపికైనట్టు వచ్చిన వార్తలు కూడా ఆసిన్ కు అనూహ్యంగా పెరిగిన డిమాండ్ ను చాటిచెప్పాయి. అయితే డిస్నీ పిక్చర్స్ తలపెట్టిన రెండు చిత్రాల్లో ఒకటైన 'జాకోమాన్' చిత్రం నుంచి ఇప్పుడు ఆసిన్ కు ఉద్వాసన పలికినట్టు బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సత్యజిత్ భక్తల్ దర్శకుడు.
'గజనీ' నిర్మాణంలో ఉండగానే అమీర్ ఖాన్ తన మిత్రుడైన సత్యజిత్ భక్తల్ కు ఆసిన్ పేరును సిఫారసు చేశారనీ, అయితే ఆసిన్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను డిస్నీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనీ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. డిస్నీ సంస్థ రెండో ప్రాజెక్ట్ కూడా ఇంకా ప్రారంభం కానందున ఆసిన్ నటించే అవకాశం కూడా ఇంకా అనిశ్చితమేననీ వారు అభిప్రాయపడుతున్నారు. 'జాకోమాన్' నుంచి ఆసిన్ కు ఉద్వాసన చెప్పడంతో ఆమె ప్లేస్ లో నటి మంజరి ఫడ్నీస్ వచ్చి చేరింది. 'జానే తు యు జానే న' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన మంజరి ఆ తర్వాత 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' చిత్రం ద్వారా తెలుగులోనూ పరిచయమైంది. ఏడాది తర్వాత మళ్లీ హిందీలో తనకు మంచి అవకాశం రావడంతో మంజరి సంతోషానికి అవధులు లేవట.