రెహ్మాన్ సన్మానానికి కలామ్
చెన్నై: డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కు తమిళ సినీ పరిశ్రమ తరఫున భారీ సన్మానానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 1న సినీ మ్యుజిషియన్స్ ఆడిటోరియంలో సినీ సంగీత దిగ్గజాలంతా కలిసి రెహ్మాన్ ను ఘనంగా సన్మానించారు. తాజాగా రెహ్మాన్ కు ఘన సన్మానం జరపాలని తమిళ పరిశ్రకు చెందిన వివిధ యూనియన్లు, అసోసియేషన్లు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. నిర్మాతల మండలి చైర్మన్ రామనారాయణన్, ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ కాట్రగడ్డ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షుడు భారతీరాజా, వర్కర్స్ యూనియన్ లీడర్ ఫెఫ్సి విజయన్, డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ చైర్మన్ కలైపులి శేఖరన్, పిఆర్ఓ యూనియన్ చైర్మన్ మురళి ఇటీవల సమావేశమై రెహ్మాన్ ను సన్మానించాలని తీర్మానించారు. వీరంతా రెహ్మాన్ ను అభినందించేందుకు రెండ్రోజుల క్రితం ఆయనను కలిసి తాము తలపెట్టిన గ్రాండ్ సెలబ్రేషన్ వివరాలను తెలియజేశారు.
రెహ్మాన్ సైతం తన అంగీకారాన్ని తెలియజేశారనీ, అయితే ఇంకా సన్మానం తేదీ ఖరారు కాలేదనీ, మార్చి చివర్లో ఉండే అవకాశాలున్నాయనీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. రెహ్మాన్ కు జరుగనున్న ఈ భారీ సన్మాన కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి
పాల్గొంటారని తెలుస్తోంది.
News Posted: 3 March, 2009
|