మార్షల్ ఆర్ట్ శిక్షణలో ఆసిన్
ఆసిన్ బాలీవుడ్ కు ఎక్కడ్నించి వచ్చిందో అదే కేరళకు తిరుగు ముఖం పడుతోంది. అలాగని ఆసిన్ అభిమానులు ఎంతమాత్రం నిరాశ చెందాల్సిన పనిలేదు. కలరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ ప్రక్రియలో శిక్షణ పొందేందుకు మాత్రమే ఆమె కేరళ వెళ్తోంది. '19 స్టెప్స్' అనే చిత్రం కోసం ఆమె కలరిపయట్టు యుద్ధ విద్యను నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. భరత్ బాల డైరెక్షన్ లో ఈ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఇందులో జపాన్ స్టార్ టడనోబు ఆసనోతో కలిసి ఆసిన్ నటిస్తోంది. కథా క్రమంలో భాగంగా భిన్న సంస్కృతులకు చెందిన ఈ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. మార్షల్ ఆర్ట్ శిక్షణకు కేరళ వెళ్తున్న విషయాన్ని ఆసిన్ ధ్రువీకరించింది. ' కలరియపట్టు అంటే కేరళ మార్షల్ ఆర్ట్ ప్రక్రియ. అన్ని మార్షల్ ఆర్ట్స్ కు తల్లిలాంటిది. పాత్రపరంగా ఈ ఆర్ట్ లో నేను శిక్షణ పొందవలసి ఉంది' అని ఆమె తెలిపారు.
ఏప్రిల్ నుంచి ఆసిన్ ఇందుకోసం శిక్షణ తీసుకోనుంది. ఇందుకోసం కేరళ వెళ్తుండటం పట్ల ఆసిన్ ఎంతో ఉత్సుకత చూపుతోంది. సాంప్రదాయ కలరిపయట్టు గురువులు తనకు ఈ విద్యను నేర్పనున్నారనీ, అంతా అనుకుంటున్నట్టు ఇందులో తాను జపాన్ అమ్మాయిగా నటించడం లేదనీ, సాంప్రదాయ భారతీయ అమ్మాయి పాత్రను పోషించనున్నాననీ ఆమె వివరణ ఇచ్చారు. జపాన్, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఆ తర్వాత హిందీలోకి అనువదిస్తారు. 'గజనీ' హిందీలో సక్సెస్ ఫుల్ ఎంట్రీ చేసి తర్వాత మళ్లీ తమిళ చిత్రాల వైపు రావడం వల్ల బాలీవుడ్ కెరీర్ కు గండి కొట్టుకోవడమే అవుతుంది కదా అని అడిగినప్పుడు ఎంత మాత్రం కాదని ఆసిన్ సమాధానమిచ్చారు. బాలీవుడ్ లో మాత్రమే తరచు కనబడాలనే తాపత్రయం తనకు లేదనీ, తాను నటించిన హిందీ చిత్రం బాగా ఆడిందంటే ఆ భాషా చిత్రాల్లో మాత్రమే నటిస్తానని అర్ధం చేసుకోరాదనీ ఆమె పేర్కొన్నారు. '19 స్టెప్స్' చిత్రం తనకెంతో నచ్చి అంగీకరించాననీ, నిజానికి మూడేళ్ల క్రితం 'గజనీ' తమిళ వెర్షన్ లో బిజీగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందని తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో వాల్డ్ డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రారంభించనుందని ఆమె వెల్లడించారు.
News Posted: 3 March, 2009
|