షారూక్ ఎవరు?
ఆస్ట్రేలియన్ పాప్ సంచనలం కిలీ మినోగు ఇండియాలో వారం రోజుల షెడ్యూల్ ముగించుకుని వచ్చినంత వేగంగానే వెళ్లిపోయింది. ఒకటి రెండు సంచలనాలను కూడా వదిలి వెళ్లింది. ఇండియాలో కాలుపెట్టగానే ఆమెకు ఘనస్వాగతం లభించింది. అందరి దృష్టినీ ఆకట్టుకుంది. తాజాగా ఓ సంచనలం వెలుగుచూసింది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ను కలుసుకునేందుకు ఆమె నిరాకరించడమే ఆ తాజా సంచలనం. శ్రీ అష్ట వినాయక సినీ విజన్ లిమిటెడ్ బ్యానర్ పై రూపొందుతున్న 'బ్లూ' చిత్రంలో ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది ఇందులో ఓ సాంగ్ కు ఆమె నేపథ్యగానం సైతం అందిస్తున్నారు. కిలీ సెట్స్ లో ఉన్న విషయం తెలుసుకున్న ఇండియన్ ఫాన్స్ పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నప్పటికీ వారిని కలుసుకునేందుకు నిరాకరించడం ద్వారా కిలీ వారి ఉత్సాహంపై నీళ్లు చల్లింది. సెట్స్ లోకి అభిమానులు చొరపడకుండా 'నో ఎంట్రీ' కోసం కూడా ఆమె గట్టిగా పట్టుబట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
'బ్లూ' యూనిట్ వర్గాల కథనం ప్రకారం, తాను షూటింగ్ లో ఉండగా విజిటర్లను కానీ, తన సహనటుల కుటుంబ సభ్యులను కానీ, బాలీవుడ్ కు చెందిన ఇతరులను కానీ సెట్స్ లోకి అనుమతించరాదని కిలీ షరతు విధించింది. షారూక్ 'ఓం శాంతి ఓం' చిత్రం బాలీవుడ్ లో తనకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటంటూ కిలీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకుని షారూక్ కార్యాలయ సిబ్బంది ఆమెతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. షారూక్ ఖాన్ ఆమెను కలవాలనుకుంటున్నారంటూ తెలియజేశారు. అయితే షారూక్ ను సెట్స్ లో కలుసుకునేందుకు కిలీ నిరాకరించిందని ఆ వర్గాలు తెలిపాయి. సినిమా పూర్తయిన తర్వాత జరిగే పార్టీలో మాత్రమే కలిసే అవకాశముందంటూ కిలీ మేనేజర్ షారూక్ కు తెలియజేసినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ట్స్ ను కలుసుకునేందుకు కిలీ నిరాకరించడం ఇది ప్రథమం కూడా కాదు. గతంలో జావేద్ ఖాన్ తో కలిసి వెళ్లిన అనుష దండేకర్ ను సైతం కిలీ భద్రతా సిబ్బంది సెట్స్ లోకి పోనీయలేదు. కిలీ ఈసారి పర్యటనలో భాగంగా సంజయ్ దత్ ఆమెకు పార్టీ ఇవ్వబోతున్నారంటూ గట్టి ప్రచారమే జరిగినప్పటికీ అది కూడా జరగనేలేదు. కిలీ కోసం ఓ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు సంజయ్ దత్, అతని బిజినెస్ మేనేజర్ ప్రకటించారనీ, అయితే ఆ పార్టీ గురించి ఆమెకు ఎలాంటి సమాచారం లేనందున ఆమె శుక్రవారం రాత్రే ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిందని పలువురి కథనం. అంథొని డి సౌజ దర్శకత్వంలో 'బ్లూ' చిత్రం రూపొందుతోంది.
News Posted: 7 March, 2009
|