మధుబాలగా కంగనా
'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' చిత్రంలో మధుబాల పాత్ర 'ఫ్యాషన్' ఫేమ్ కంగనా రనౌత్ ను వరించింది. 1960వ దశకంలో అండర్ వరల్డ్ డాన్ గా సంచనలం సృష్టించిన హాజీమస్తాన్ నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. హాజీ మస్తాన్ ప్రేమికురాలిగా మధుబాలను అప్పట్లో చెప్పుకునేవారు. ఏక్తా కపూర్ సొంత నిర్మాణ సంస్థ అయిన బాలీజీ ఫిలింస్ పతాకంపై మిలన్ లుథిరియా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
కంగనా ఎంపిక ముందు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా పేర్లను కూడా లుథిరియా పరిశీలించారనీ, ఇప్పటికే అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హస్మిలను హీరోలుగా ఎంపిక చేసినప్పటికీ హీరోయిన్ల ఎంపిక జరగనుందని చిత్ర నిర్మాణం ప్రారంభం కావడానికి జాప్యం జరుగుతూ వచ్చిందనీ ప్రొడక్షన్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కంగనా రనౌత్ ఎంపిక జరిగినందున ముంబై పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. హాజీ మస్తాన్ కథాంశాలతో 'దీవార్' వంటి పలు చిత్రాలు గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' చిత్రంలో హాజీమస్తాన్, మధుబాల మధ్య సాగిన రొమాంటిక్ వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి సారించనున్నారు. హాజీ మస్తాన్ గా అజయ్ దేవగణ్, యంగ్ దావూద్ గా ఇమ్రాన్ హస్మీ నటించనున్నారు.
News Posted: 9 March, 2009
|