మళ్లీ షారూక్ మేకప్
భుజానికి జరిగిన శస్త్రచికిత్స అనంతరం నెలరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న షారూక్ మళ్లీ సెట్స్ పైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. తన విశ్రాంతి సమయాన్ని పలు స్క్రిప్టులు చదువుతూ, కుటుంబ సభ్యులకే కేటాయిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈనెల 19 నుంచి తిరిగి ఆయన కరణ్ జోహర్ 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
నిజానికి షారూక్ తిరిగి సెట్స్ పైకి వస్తున్న విషయాన్ని అధికారికంగా ఎవరూ నిర్దారణ చేయనప్పటికీ, క్లిష్టమైన సన్నివేశాలు, ఫైటింగ్ ఘట్టాల జోలికి వెళ్లకుండా డ్రమెటిక్ సన్నివేశాల్లో మాత్రమే ప్రస్తుతం పాల్గొంటారని తెలుస్తోంది. కరణ్ జోహర్ చేతిలో షారూక్ ఖాన్ సినిమా ఒక్కటే ఉండటంతో ఆయన తగిన సమయాన్ని తీసుకుంటూ షారూక్ భుజానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా షూటింగ్ జరపనున్నారని చెబుతున్నారు. షారూక్ సైతం ఈ ఏడాది చివర్లో మాత్రమే ఫరా అక్తర్ 'డాన్ 2' చిత్రానికి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. షారూక్ సరసన ప్రియాంక చోప్రా నటించనుంది. షారూక్ ను కలుసుకుని ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్న ఆయన సహచర నటుల్లో ప్రియాంక కూడా ఉంది. షారూక్ తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్న విషయంపై కరణ్ ను సంప్రదించగా 'షారూక్ ఆరోగ్యంగా ఉండటమే అన్నిటికంటే ముఖ్యమైన అంశం. సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆయన చక్కటి ఆరోగ్యంతో స్వస్థత పొందడమే ముఖ్యం' అని తెలిపారు. జోహర్, ఖాన్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. నిర్మాణం, మార్కెటింగ్ వ్యవహారాల్లోనూ షారూక్ చురుకైన పాత్ర పోషించబోతున్నారు. షారూక్ కూ, తనకూ ఈ చిత్రం చాలా ముఖ్యమైనదనీ, షారూక్ తో కలిసి, షారూక్ కోసం ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని మలచాలన్నదే తన కోరికనీ తెలిపారు.
News Posted: 9 March, 2009
|