పొలిటికల్ నాయక్ సంజూ!
దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సంజయ్ దత్ ఇప్పుడు తన రాజకీయ కెరీర్ కు కూడా ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ రావడమే తరువాయి. అయితే కోర్టు నుంచి తగిన అనుమతి లభిస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే సంజయ్ లక్నోలో 45 రోజుల పాటు నివాసం ఉండి ప్రచారం జరిపేందుకు తగిన సన్నాహాలు కూడా చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కనీసం కొద్దిరోజుల వరకైనా ఆయన సినిమాలకు చెబక్ చెప్పబోతున్నారు..
నిజానికి అజయ్ దేవగన్ 'ఆల్ ద బెస్ట్' సినిమా ఆఫర్ ను సంజయ్ ప్రొడక్షన్స్ హౌస్ స్వచ్ఛందంగానే వదులుకుంది. సంజయ్ బదులు అనిల్ కపూర్ అయితే బాగుంటుందని సూచించడమూ జరిగింది. అయితే సంజయ్ మాత్రమే కావాలని అజయ్ పట్టుబట్టారనీ, ఆయన అయితేనే ఈ ప్రాజెక్ట్ కు స్పెషాలిటీ వస్తుందనీ పేర్కొన్నారనీ ఆ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మే 1 నుంచి సంజయ్ తన డేట్స్ ను అజయ్ కు కేటాయించారు. ప్రసుతం సంజయ్ ముంబైలో తన పనిని ముగించుకుని మార్చి 15 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకూ లక్నోలోనే ఉంటారనీ, ఎన్నికల తర్వాతే ఆయన తిరిగి ముంబై చేరుకుంటారనీ వారు తెలిపారు. సంజయ్ ఎన్నికల్లో పోటీచేయడం, ప్రచారం చేపట్టే సందర్భాల్లో ఆయన భార్య మాన్యత ముంబై నుంచి లక్నోకు షటిల్ చేస్తారు. ఇందుకోసం ఈ జంటకు ఓ హౌస్ కూడా కేటాయించారు.
ఇందులో సంజయ్ కోసం ఆరోగ్యకరమైన ఫుడ్ ను మాన్యత అందుబాటులో ఉంచుతారు. ఆల్కహాల్ మాత్రం ఉండదు. ఎందుకంటే సంజయ్ మందు తాగడం ఆపేశారు. సంజయ్ మందు మానేసినప్పటి నుంచి ఆయనలోని ఎనర్జీ పాళ్లు పెరిగాయనీ, ఇప్పుడు క్షణం తీరిక లేకుండా ఇటు రాజకీయాలు, అటు సినిమాల మధ్య సమతూకం పాటిస్తున్నారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
News Posted: 9 March, 2009
|