'కమీనే' షాహిద్ కు నత్తి?
వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీయడంలో నిష్ణాతుడైన ఫిల్మ్ మేకర్ గా విశాల్ భరద్వాజ్ ను చెప్పుకోవచ్చు. ఈసారి అలాంటి రియలస్టిక్ పంథానే ఆయన అనుసరించనున్నారు. తాను తాజా చిత్రం 'కమీనే' కోసం ఆయన దగ్గరుండి చిత్ర కథానాయకుడు సాహిద్ కపూర్ కు తగిన తర్ఫీదు ఇప్పిస్తున్నారు. షాహిద్ కు తర్ఫీదు ఇస్తున్నది మరెవరో కాదు. ఇఎన్ టి సర్జన్ డాక్టర్ ప్రబోధ్ కార్నిక్. అసలు విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో షాహిద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రపేరు చార్లి. నత్తిగా మాట్లాడుతుంటాడు. మరో పాత్ర పేరు గుడ్డు. ఇతనికి స్పీచ్ లోపం. అంటే ఒక అక్షరం బదులు మరో అక్షరం పలుకుతుంటాడు. రెండు పాత్రలకూ స్పీచ్ డిఫెక్ట్ ఉండటంతో వాటిపై పూర్తి అవగాహన తెచ్చుకున్న అనంతరమే షాహిద్ ను కెమెరా ముందుకు తీసుకురావలన్నదే విశాల్ భరద్వాజ్ పట్టుదల.
సినిమా షూటింగ్ కు కొద్దిరోజులు ముందు దాదర్ లోని డాక్టర్ కార్నిక్ క్లినిక్ లో విశాల్, షాహిద్ లు ఆయనను కలుసుకున్నారు. నత్తిగా ఉండే వాళ్లు, కొన్ని పదాలు పలకడం రాని వాళ్ల సంభాషణలు ఎలా ఉంటాయి, రెండింటి మధ్యా వైరుధ్యం ఏమిటనే అంశాలపై డాక్టర్ కార్నిక్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ విషయాన్ని డాక్టర్ కార్నిక్ సైతం ధ్రువీకరించారు. విశాల్ భరద్వాజ్ తనకు తెలుసుననీ,కొంతమందిలో నత్తి ఎందుకు ఉంటుంది, వారిని ఎలా ట్రీట్ చేయాలనే అంశాల గురించి ఆయన అడిగారనీ, వారికి అవసరమైన సమాచారాన్ని తాను అందించాననీ చెప్పారు. డాక్టర్ కార్నిక్ ను కలుసుకున్న విషయం నిజమేనని షాహిద్ తెలిపారు. వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీయడానికి విశాల్ ఎంతో ఇష్టపడుతుంటారనీ, డాక్టర్ కార్నిక్ తో జరిపిన సమావేశం తమకెంతగానో ఉపయోగపడిందనీ చెప్పారు. కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం తమకు లభించిందన్నారు. రెండు రోజుల పాటు రోజుకు గంట చొప్పున డాక్టర్ కార్నిక్ తో షాహిద్, విశాల్ సమావేశ మయ్యారు. అనంతరం బధిరులు, మాటల అవకరం ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన అలి యవర్ జుంగ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ కు సాహిద్ వెళ్లారు. అక్కడి పేషంట్లతో నేరుగా సంభాషించారు. ఆడియోలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ సాధనా రెలేకర్ ఆధ్వర్వంలో ఈ సమావేశం జరిగినట్టు డాక్టర్ కార్నిక్ వివరించారు. నత్తి, కొన్ని పదాలు పలకకపోవడం వంటివి పురుషుల్లోనే ఎక్కువనీ, తొలినాళ్లలో చిన్నపిల్లలు గడగడా మాట్లాడలేకపోవడం అనే సమస్యను ఎదుర్కొంటారనీ, గడగడా చదవమని తల్లిదండ్రులు ఫోర్స్ చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందనీ ఆయన విశ్లేషించారు. 'కమీనే' రషెస్ ను చూశారా అని అడిగినప్పుడు 'అది నా పరిధిలో లేదు' అంటూ కార్నిక్ నవ్వుతూ సమాధానమిచ్చారు. షాహిద్ సైతం ఇందులో నటించడం ఓ ఛాలెంజింగ్ ఎక్స్ పీరియన్స్ గా అభివర్ణించారు.
News Posted: 11 March, 2009
|