బాలీవుడ్ బిజీ బిజీ
ముంబై: ఈ వేసవిలో మీ అభిమాన సినీ స్టార్ ను దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారా? అలా అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లకు వేదిక అయిన ఏదైనా క్రికెట్ స్టేడియంకు లేదా రాజకీయ ర్యాలీకి వెళ్ళండి. సినిమా షూటింగ్ లలో మాత్రం స్టార్లు కనిపించరు. రాజకీయ పార్టీల కోసం ప్రధానంగా ప్రచారం చేసే ప్రముఖ నటీనటులకు లేదా ఏదైనా క్రికెట్ జట్టుకు మద్దతుదారులుగా ఉండే తారా ప్రముఖులకు అనుకూలంగా షూటింగ్ కార్యక్రమాలు మార్చుకోవాలని నటులు, దర్శకులు నిర్ణయించుకున్నారు. కొందరు సినీ ప్రముఖులు స్వయంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు కూడా.
అజయ్ దేవగన్ సొంత నిర్మాణ సంస్థ సంజయ్ దత్ తో తీస్తున్న చిత్రం షూటింగ్ ను ఎన్నికల తేదీలను పరిగణనలోకి తీసుకుని మార్చి నుంచి మే నెలకు వాయిదా వేసింది. సంజయ్ మే 15 నుంచి షూటింగ్ లో పాల్గొనగలరని ఆయన మేనేజర్ ధరమ్ ఒబెరాయ్ చెప్పినప్పటికీ అసలు షూటింగ్ కార్యక్రమం ఇంకా వాయిదా పడవచ్చునని, ఎందుకంటే ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడతాయని పరిశ్రమ వర్గాలు సూచించాయి.
ఇది ఇలా ఉండగా, తాను త్వరగా లక్నోకు వెళ్ళవలసి ఉన్నందున సంజయ్ దత్ తాను ప్రస్తుతం నటిస్తున్న 'చతుర్ సింగ్ టూ స్టార్' చిత్రంలో ఒక పాట చిత్రీకరణను మెహబూబ్ స్టూడియోస్ లో ఒకటిన్నర రోజులో ముగించారు. 'దత్ సాబ్ మొదటి రెండు రోజులూ రాలేదు. ఆతరువాత మూడు షిప్ట్ లలో పాట చిత్రీకరణను పూర్తి చేయవలసిందిగా దర్శకుడు అశోక్ చతుర్వేదిని కోరారు' అని ఈ చిత్రం యూనిట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంజయ్ దత్ కు పలు చిత్రాలలో పాటలు పాడిన వినోద్ రాథోడ్ లక్నోలో ఆయన తరఫున తప్పకుండా ప్రచార సభలలో పాల్గొంటారు. మున్నాభాయ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనవలసిందిగా అర్షద్ 'సర్క్యూట్' వార్సిని కూడా సంప్రదించినట్లు తెలుస్తున్నది.
News Posted: 15 March, 2009
|