అమర్ సింగ్ 'ఛార్జిషీట్'
రాజకీయాలకూ, సినీరంగానికీ విడదీయరాని అనుబంధమే ఉంది. అశేష ప్రేక్షకాభిమానులున్న స్టార్ లు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తే, కొండొకచో రాజకీయ నాయకులు వెండితెరపై కనీసం ఒకసారైనా కనిపించాలని తపనపడుతుంటారు. సమాజ్ వాది పార్టీ జనరల్ సెక్రటరీ అమర్ సింగ్ బహుశా నిజజీవితంలో ఇలాంటి పాత్రను ఎప్పుడూ పోషించి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఓ హిందీ చిత్రంలో హోం మంత్రి పాత్రను పోషించడానికి సిద్ధపడుతున్నారు. 'ఈ అఫర్ ఇచ్చింది మరెవరో కాదు. బాలీవుడ్ స్టాల్ వార్ట్ దేవానంద్ ' అని అమర్ సింగ్ తెలియజేశారు. దేవానంద్ తాజా చిత్రం 'ఛార్జిషీట్' కోసం అమర్ సింగ్ హోం మంత్రి వేషం కడుతున్నారన్నమాట.
దేవానంద్ కు తాను వీరాభిమానిననీ, ఆయన చిత్రంలో నటించే అవకాశం రావడం తనకెంతో సంబరంగా ఉందనీ ఆయన తెలిపారు. ఆసక్తికరంగా సినిమాల్లోంచి రాజకీయల్లోకి వచ్చిన స్టార్ హీరో సంజయ్ దత్ ఇప్పుడు సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా లక్నో నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాల్లో అమర్ సింగ్ సైతం పాల్గొనబోతున్నారు. ఇందుకు ప్రతిగా దత్ నుంచి ఆయన నటనలో ఓనమాలు నేర్చుకోబోతున్నారా?. ఈ ప్రశ్నకు అమర్ సింగ్ ఒకింత సీరియస్ గా చూస్తూ 'అమర్ సింగ్ జీకి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ఆయనకు ప్రతీదీ వెన్నతో పెట్టిన విద్య' అంటూ సూటిగా సమాధానమిచ్చారు.
News Posted: 17 March, 2009
|