'ఫైట్' సీన్ 300 కోట్లు
ముంబై: బాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన ఫైటింగ్ సీన్ ఇది. ఇందుకు మూల్యం అక్షరాలా 300 కోట్ల రూపాయిలు. మల్టీప్లెక్స్ యజమానులకూ, నిర్మాతలకూ మధ్య రెవెన్యూ షేర్ విషయంలో తలెత్తిన వివాదంతో రాబోయే మూడు నాలుగు నెలల్లో హిందీ పరిశ్రమకు రూ.300 కోట్ల వరకూ నష్టం వాటిల్లే ప్రమాదం తలెత్తింది. సమస్య పరిష్కారమయ్యేంత వరకూ తమ సినిమాలు విడుదల చేయరాదని 24 మంది అగ్ర నిర్మాతలు నిశ్చయించారు. దీంతో రాబోయే రెండు నెలల్లో విడుదలకు సిద్ధంగా న్ఉన్న రెండు డజన్ల సినిమాల పరిస్థితి అగమ్యగోచరం కానుంది.
మల్టీపెక్స్ ఓనర్లపై నిర్మాతల తరఫు ప్రతినిధి ముఖేష్ భట్ 'యుద్ధం' ప్రకటించారు. మల్టీపెక్స్ యజమానులు రెవెన్యూ షేర్ విషయంలో హెచ్చు మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటంతో గత మూడేళ్లకు పైగా నిర్మాతలు భారీ నష్టాలను చవిచూస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. 'వాళ్లు మమ్మల్ని లూటీ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ ఓనర్ల లాబీ ఎప్పుడూ నిర్మాతను ఒంటరిని చేస్తోంది' అని ఆయన వ్యాఖ్యానించారు. డిస్ట్రిబ్యూటర్లకూ, మల్టీప్లెక్స్ లకు మధ్య రెవెన్యూ షేరింగ్ అనేది పెద్ద సినిమా, చిన్న సినిమా అని గానీ, సినిమా బడ్జెట్ ను బట్టి కానీ ఉండదనీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫార్ములా అమలవుతోందనీ నిర్మాతల వాదన. ఆ దృష్ట్యా 50-50 షేర్ కోసం నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి ఎలాంటి ప్రమోస్ లు, ట్రైలర్లు రిలీజ్ చేసేది లేదనీ, సమస్య పరిష్కారం కాకుంటే కనీసం జూన్ వరకైనా ఎలాంటి రిలీజ్ లు ఉండబోవనీ వారు తేల్చిచెబుతున్నారు. 'సకాలంలో సినిమాలు రిలీజ్ కాకుంటే 300 కోట్ల వరకూ రెవెన్యూ నష్టపోవాల్సి రావచ్చు' అని ఇండియన్ ఫిల్మ్ కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ ప్రీతి షహాని అంచనా వేశారు. భట్ మరింత తీవ్రంగా స్పందిస్తూ, నిర్మాతల్లో చీలిక తెచ్చేందుకు మల్టీప్లెక్స్ ఓనర్లు పన్నాగాలు పన్నుతున్నారనీ, అయితే ఇప్పుడు నిర్మాతలంతా ఏకతాటిపై ఉన్నందున ఈ పన్నాగాలు తిప్పికొట్టి ఒక పరిష్కారం సాధిస్తామనీ ఆయన స్పష్టంచేశారు. దీనిపై మల్టీప్లెక్స్ ఓనర్ల తరఫున యాడ్ ల్యాబ్స్ కు చెందిన శరవణన్ ష్రాఫ్ ను సంప్రదించినప్పుడు మరోసారి ప్రెస్ ముందుకు వస్తామని సమాధానం దాటవేశారు.
News Posted: 17 March, 2009
|