సల్మాన్ కు బన్సాలీ పోటు!
ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీపై సల్మాన్ భాయ్ నిప్పులు చెరుగుతున్నారు. ఇక జన్మలో ఆయనతో కలిసి పనిచేసేది లేదని కూడా తేల్చిచెబుతున్నారు. బన్సాలీ తనను నిలువునా మోసం చేశాడని వాపోతున్నారు. బన్సాలీ తన 'సావరియా' చిత్రం సమయంలో సల్మాన్ ను నటించేందుకు ఒప్పిస్తూ, తదుపరి ప్రాజెక్ట్ సల్మాన్ తోనే చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు దానిని తుంగలో తొక్కడమే ఇందుకు కారణం.
బన్సాలీ మాటను దృష్టిలో పెట్టుకున్న సల్మాన్ హాలీవుడ్ లో విజయవంతమైన 'ది ప్రిస్టేజ్' చిత్రం రీమేక్ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించారు. ఆ సినిమా డివిడిని కూడా బన్సాలీకి ఆయన ప్రెజెంట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను బన్సాలీ కార్యరూపంలోకి తీసుకువస్తారనే అభిప్రాయంతో సల్మాన్ ఉండేవారు. నెలలు గడిచాయి. తాజాగా సల్మాన్ ఓ సంగతి గ్రహించారు. సల్మాన్, హృతిక్ రోషన్ ఇటీవల కలుసుకున్నప్పుడు పిచ్చాపాటీ మాటల్లో హృతిక్ ఓ బాంబు పేల్చారు. బన్సాలీతో తాను ఓ సినిమా చేయబోతున్నాననీ, హాలీవుడ్ 'ది ప్రిస్టేజ్'కు అది రీమేక్ కావచ్చనీ హృతిక్ వెల్లడించారు. దీంతో సల్మాన్ ముఖం కందగడ్డ అయింది. అసలు ఆ సినిమా ఐడియా తానిచ్చాననీ, ఇప్పుడు బన్సాలీ ఆ ఐడియానే వేరే హీరో కోసం వాడుకుని తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఖాన్-దాన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ 'మారిన పరిస్థితులను సల్మాన్ కు బన్సాలీ విడమమరరచి చెప్పి ఉండాల్సింది' అని వారు అభిప్రాయపడ్డారు. 'ఖామోషి', 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రాల విషయంలో బన్సాలీతో తనకున్న అనుబంధాన్ని పురస్కరించుకునే 'సావరియా' చిత్రంలో నటించేందుకు సల్మాన్ ఒప్పుకున్నారనీ, షారూక్ 'ఓం శాంతి ఓం' సినిమా సమయంలోనే ఆ చిత్రం రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ వర్క్ లోనూ సల్మాన్ తన విలువైన సమయాన్ని వెచ్చించారనీ వారు తెలిపారు. రణ్ బీర్ కపూర్, సోనమ్ కపూర్ జంట 'సావరియా'తో పరిచయం కాగా, ఆ సినిమా ప్రమోషన్ కు బన్సాలీ ఏమి చెబితే సల్మాన్ అలా చేసుకుంటూ వెళ్లాడనీ, అంత చేసిన సల్మాన్ మాత్రం బన్సాలీ నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదని వారు విశ్లేషించారు.
News Posted: 19 March, 2009
|