అజ్మీర్ లో రెహ్మాన్ సొంతిల్లు
రెండు 'ఆస్కార్' అవార్డులతో దేశానికి చిరకీర్తి తెచ్చిపెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ లో ఆధ్యాత్మికత మెండు. దైవభక్తి, మత విశ్వాసాలు అంటే ప్రాణం పెడతారు. ఆయనకున్న ఆ నమ్మకమే ఇప్పుడు ఆయనను రాజస్థాన్ లోని అజ్మీర్ కు చేర్చింది. ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త హజ్రత్ ఖ్వాజి మొయినుద్దీస్ హసన్ చిష్టీకి చెందిన దర్గా షరీఫ్ ఇక్కడే ఉంది. ఈ దర్గా షరీఫ్ కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందన్ నగర్ లో ఇప్పుడు రెహ్మాన్ ఓ బంగళా కొనుగోలు చేశారు.
'అజ్మీర్ దర్గా షరీఫ్ ను రెహ్మాన్ భక్తి విశ్వాసలతో కొలుస్తారు. ఏ కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా ఆ దర్గాను దర్శించడం ఆనవాయితీ. తరచు ఆ ప్రదేశాన్ని దర్శించి అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. చాలాకాలంగా ఆయన దర్గాకు సమీపంలో ఓ ఇల్లు కొనాలనే కోరిక ఉంది. ఆయన తల్లి కోరిక కూడా అదే' అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కొద్దికాలంగా విస్తృతంగా ఇంటికోసం
ప్రయత్నించిన రెహ్మాన్ ఎట్టకేలకు కుందన్ నగర్ లో ని స్నేహ బంగళా నెంబర్ 8ను గత నవంబర్ లో కొనుగోలు చేశారని వారు తెలిపారు. రెహ్మాన్ తల్లి కరీనా కూడా ఇటీవల అక్కడుకు షిఫ్ట్ అయ్యారు. రెహ్మాన్ తన కుటుంబ సభ్యులతో ఇటీవల ఆ దర్గాను సందర్శించుకున్నారు. ఆ ట్రిప్ లో ఆయన సొంతింట్లోనే ఉన్నారు. దీనిపై రెహ్మాన్ ఇంకా స్పందించాల్సి ఉంది.
News Posted: 19 March, 2009
|