'దోస్తానా'కు సీక్వెల్
అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో గత ఏడాది నవంబర్ 14న విడుదలైన 'దోస్తానా' చిత్రాన్ని ఇప్పట్లో మర్చిపోవడం సాధ్యంకాకపోవచ్చు. స్వలింగ సపర్కుల జంటగా (గే కపుల్) అభిషేక్, జాన్ అబ్రహం చేసిన నవ్వుల సందడి అలాంటిది మరి. దీనికి ప్రియాంక చోప్రా తోడై చేసిన సందడి ఆ చిత్రాన్ని బాక్సాఫీస్ హిట్ చేసింది. కరణ్ జోహర్ సమర్పకుడుగా తరుణ్ మన్షుఖాని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ఇదే దర్శక నిర్మాతల ద్వయం 'దోస్తానా'కు సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక మంచి ప్లాట్ లైన్ కోసం అంతా సీరియస్ గా తలమునకలవుతున్నామనీ, ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చేయాలనుకుంటున్నాననీ తరుణ్ మున్షుఖాని వెల్లడించారు. దోస్తానా సీక్వెల్ పై అంతా దృష్టి సారిస్తున్నామని కరణ్ సైతం ధ్రువీకరించారు.
అభిషేక్ బచ్చన్ అయితే సీక్వెల్ ఆలోచనకు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 'ఇది నిశ్చయంగా ఓ మంచి ప్రయత్నం అనుకుంటున్నాను. అందరికీ ఈ ఐడియా నచ్చుతుంది. దోస్తానా ఓ పాపులర్ బ్రాండ్. బాలీవుడ్ లో ప్రస్తుతం నేనూ, జాన్ అబ్రహం హాటెస్ట్ పెయిర్ కూడా' అంటూ నవ్వేశారు. 'దోస్తానా-2' థీమ్ కోసం తరుణ్ ను ప్రశ్నించినప్పుడు 'ఏదో సీక్వెల్ కోసం సీక్వెల్ తీయడం కాదు. కామెడీ చేసినా పదికాలాల పాటు నిలిచేలా ఉండాలి. మూడు ప్రధాన క్యారెక్టర్లు బాగా పండటంతో దోస్తానాకు ఓ ప్రత్యేకత వచ్చింది. ఆ సినిమా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుంది' అని చెప్పారు. ఈ సీక్వెల్ లో కూడా మన 'గే జంట' అభిషేక్, అబ్రహం కంటిన్యూ అవుతారు. అయితే వారి కథను ఎవరూ నమ్మకపోవడమే ప్రధానమైన ట్విస్ట్ అవుతుందట. ఆసక్తికరంగా ఈసారి పంజాబీ నేపథ్యంలో ఈ సీక్వెల్ ఉంటుంది.
News Posted: 19 March, 2009
|