ఇషా డియోల్ గాయబ్!
ఇషా డియోల్ కు ఏమైంది? ఆమె పేరు విని, కనీసం పబ్లిక్ ఫంక్షన్లలోనైనా చూసి దాదాపు ఆరు నెలలు అయింది. ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ఇషా 'మిస్సింగ్' వ్యవహారం చర్చనీయాంశ మవుతోంది. పరిశ్రమలో చాలాకాలంగా కొనసాగుతూ, హేమమాలిని-ధర్మేంద్ర గారాలపట్టిగా సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్న ఇషా ఎందుకు ముఖం చాటేస్తోంది? సరైన అవకాశాలు లేకపోవడం వల్లనేనా? ఇవన్నీ పరిశ్రమ వర్గాలను వేధిస్తున్న ప్రశ్నలు. ఇషా ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవీ పెద్దగా లేవనీ, పలు సినిమాలు ప్రపోజల్ స్టేజ్ లోనే ఆగిపోయాయనీ, దీంతో ప్రస్తుతం ఆమె ఏం చేస్తోందనేది చాలామందికి అంతుబట్టడం లేదనీ ఇషా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇషా తరచు ఏవైనా ఈవెంట్లు, స్టేజ్ షోలకు హాజరు కావలసి వస్తే ఆమె వెంట హేమమాలిని కనిపించేవారు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి ఇషా హాజరుకాకపోవడం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రియాల్టీ షో 'డాన్సింగ్ క్వీన్' ఫైనల్ ఎపిసోడ్ లో తుషార్ కపూర్ తో కలిసి పాల్గొనవలసి ఉన్నప్పటికీ ఇషా ఆ కార్యక్రమానికి గైర్హాజరైంది. హేమమాలిని అదే రియాల్టీ షో జడ్డిగా కూడా వ్యవహిరించారు. హేమ బిజినెస్ మేనేజర్ ప్రభను ఈ విషయమై సంప్రదించినప్పుడు 'రియాల్టీ షోలో పాల్గొనేందుకు చాలాకాలం క్రితమే ఇషా ఒప్పుకుంది. అయితే అప్పడు ఆమె టౌన్ లో లేదు. అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ముంబైలోనే ఉంది' అని చెప్పారు. ఇషా బిజినెస్ మేనేజర్ సుబ్రతో వివరణ ఇందుకు భిన్నంగా ఉంది. ఇషా ముంబైలో లేరనీ, మరికొద్ది రోజుల్లోనే తిరిగి వస్తారనీ ఆమె సమాధానమిచ్చారు. ఇషా గురించి పెద్దగా చెప్పుకోదగిన విశేషాలు లేవంటూనే 'అంతా సవ్యంగానే ఉంది' అని హేమమాలిని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. 'డాన్సింగ్ క్వీన్' షోలో ఇషా ఎందుకు పాల్గనలేదని అడిగినప్పుడు 'యుఎస్ వెళ్లింది. అసలు ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ మీకెందుకు? మీరే ఆమె జాడ తెలుసుకోండి. లేకుంటే ఆమెనే అడగండి. నేను చాలా బిజీగా ఉన్నాను. ఇంతకన్నా మాట్లాడదలచుకోలేదు' అంటూ అసహనం ప్రదర్శించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఇషా ఇంకా అందుబాటులోకి రాలేదు.
News Posted: 20 March, 2009
|