ఎన్నికల్లో పోటీకి అమీషా నో!
బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ ఎన్నికల బరిలో దిగుతున్న తరుణంలో నటి అమీషా పటేల్ సైతం గుజరాత్ లోని రాజ్ కోట్ నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి.) టిక్కెట్ పై లోక్ సభకు పోటీ చేయబోతున్నారనే వార్త బహుశా ఎవర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తకపోయి ఉండొచ్చు. అమీషాను తాను కలుసుకున్నాననీ, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా తాము కోరిక వెంటనే అమీషా అంగీకరించిందనీ ఎన్.సి.పి. చీఫ్ (గుజరాత్) జయంత్ పటేల్ చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదంటూ అమీషా తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె ఫిల్మిస్థాన్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు.
'రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎంతమాత్రం లేదు. మరోసారి చెబుతున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు' అని అమీషా తేల్చిచెప్పారు. అమీషా కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. మరి అమీషా ఎందుకు వెనుకంజవేస్తున్నారని అడిగినప్పుడు, తన తాతగారైన రజనీ పటేల్ మంచి లాయర్ అనీ, ఆయన శ్రీమతి ఇందిరాగాంధీకి కుడిభుజంగా ఉండేవారనీ, కాంగ్రెస్ కు కోశాధికారిగా కూడా వ్యవహరించారనీ చెప్పారు. అయితే తాను మాత్రం నటిగా చేతినిండా సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాననీ అన్నారు. 'ఇక రాజకీయాలకు సమయం ఎక్కడిదో మీరే చెప్పండి?' అని ఎదురు ప్రశ్నించారు.
News Posted: 23 March, 2009
|