ఆసిన్ అసిస్టెంటే సూత్రధారి?
చెన్నై: నటి ఆసిన్ కు సహాయకుడుగా ఆమెతో పాటు ముంబై వెళ్లిన ముత్తుకుమార్ జాడ తెలియకపోవడం వెనుక మిస్టరీని ఛేదించేందుకు చెన్నై పోలీసులు తగిన ఆధారాలు సేకరిస్తున్నారు. ముత్తుకుమార్ జాడ కనిపించడం లేదనీ, ఇందుకు ఆసిన్, ఆమె తండ్రి జోసఫ్ దే బాధ్యతనీ ఆరోపిస్తూ ముత్తుకుమార్ తల్లి సుధాలయ్ వడివు పోలీసు కమిషనర్ కు గతవారంలో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులకు జోసఫ్ వివరణ కూడా ఇచ్చారు. గత జనవరి 21న ముత్తుకుమార్ ఉద్యోగం వదిలి చెన్నై వెళ్లిపోయాడనీ, అంతకుముందు అతనికి యాక్సిడెంట్ జరిగితే 2.7 లక్షలు ఖర్చు చేశామనీ ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఈ సమాచారాన్ని ఫ్రిబవరి 8న ముంబై పోలీసుల వద్ద కూడా రిజిస్టర్ చేసినట్టు వివరాలు కూడా ఆయన పోలీసులకు అందజేశారు. దీంతో ముత్తుకుమార్ వైపు నుంచి కూడా పోలీసుల విచారణ జరుగుతోంది.
ముత్తుకుమార్ తన తల్లితో కలిసే ఈ నాటకం ఆడుతున్నాడని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్లనే ఆసిన్ నుంచి డబ్బు గుంజాలనే ఆలోచనతో ఈ పనికి అతను పాల్పడి ఉండవచ్చనీ పోలీసులు అనుమాన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరించినట్టు సమాచారం. ముత్తుకుమార్ చెన్నైలో కానీ, చుట్టపక్కాల కానీ ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసు బృందం ఆ దిశగా గాలిస్తున్నాయి. ముత్తుకుమార్ జాడ తెలిస్తే కానీ అతని అదృశ్యం వెనుక అసలు కారణాలు బయటకు వచ్చే అవకాశాలు పెద్దగా లేవు.
News Posted: 23 March, 2009
|