నోట్ల కట్టలు పంచిన కత్రినా
రీల్ లైఫ్ లో హీరోయిన్లుగా కనిపించడమే కాదు...కొందరు రియల్ లైఫ్ లోనూ హీరోయిన్లే. తమకు ఇంత పేరు తెచ్చిపెట్టడానికి కారకులై అహరహం శ్రమిస్తున్న తోటి వారిని ఆదుకోవడంలోనూ వీరు ముందే ఉంటారు. అలా చేసి తమ ఔదార్యాన్ని కూడా చాటుకుంటారు. తొలినాళ్ల నుంచి తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన కత్రినా కైఫ్ ఇప్పుడు తన అభిరుచికి తగ్గట్టుగా ఎంతైనా ఖర్చు పెట్టగలిగే రేంజ్ లో ఉంది. కత్రినా కైఫ్ ఇటీవల 'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ' చిత్రం షూటింగ్ చివరి రోజున స్పాట్ బాయ్స్ తో సహా సాంకేతిక నిపుణులందరికీ 5 లక్షల రూపాయలు బహుమతిగా పంచిపెట్టి అందర్నీ సంబరంలో ముంచెత్తింది.
ఆరోజు షూటింగ్ పూర్తయిన వెంటనే కత్రినా తన వ్యాను దగ్గరకు వెళ్లి అందులోంచి కట్టలు కట్టలుగా నోట్లు తెచ్చి యూనిట్ సభ్యులకు పంచారనీ, ఎంతో హ్యాపీ మూడ్ లో ఉన్న కత్రినా తన సంతోషాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుందనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం కత్రినా ఒక్కోసారి రోజుకు 16 గంటలకు పైగా పనిచేసింది. అప్పుడు యూనిట్ సభ్యులు అందించిన సహకారం, వృత్తిపట్ల వారికున్న నిబద్దత చూసి కత్రినా ఎంతో ముచ్చటపడిందట. దీంతో పేరుపేరునా ఆందర్నీ గుర్తుంచుకుని పేరు పెట్టి పిలిచి మరీ వారికి డబ్బులు పంచిపెట్టిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇదోదో గొప్ప విషయంగా నలుగురికి చెప్పుకోవడం కత్రినాకు ఇష్టం లేదనీ, యూనిట్ సభ్యులకు ఆమె ఇచ్చిన మొత్తం 5 లక్షల వరకూ ఉంటుందని వారు తెలిపారు. డబ్బులు పంచిపెట్టే సమయంలో కత్రినా ఒక్కొక్కరిని పలకరించి వారు పడ్డ కష్టాన్ని మెచ్చుకోవడంతో యూనిట్ సభ్యులంతా కత్రినాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కీపిటప్ కేట్...
News Posted: 24 March, 2009
|