హీరోయిన్ తండ్రికి వార్నింగ్!
సల్మాన్ కండల వీరుడుగానే కాదు, చాలా ఆవేశపరుడుగా కూడా అందరికీ తెలుసు. తాను ఏది అనుకుంటే అది జరగాలనే మొండిపట్టుదల ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో విచక్షణ కోల్పోయిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. సంగీత బిజిలానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లతో గతంలో ప్రేమలో పడినప్పుడు సల్మాన్ ప్రవర్తనే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా 'లండన్ డ్రీమ్' చిత్రంలో తనకు జంటగా నటిస్తున్న ఆసిన్ పైనే ఉందట. ఆసిన్ తో ఫ్రెండ్ షిప్ చేయాలంటే ఆమె తండ్రి జోసఫ్ ప్రధాన అవరోధంగా నిలుస్తున్నారంటూ సల్మాన్ కుతకుతలాడిపోతున్నారని ఇప్పుడు ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆసిన్ సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జోసఫ్ ఆమెకు మేనేజర్ గా వ్యవహిస్తూ ఆమె వెన్నంటే ఉంటున్నారు. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్నదే. ఈ వ్యవహారం సల్మాన్ కు నచ్చలేదనీ, ఇటీవల జోసఫ్ ను గట్టిగానే మందలించారనీ బాలీవుడ్ వర్గాల ముచ్చట.
'మీరు ఆమెకు తండ్రి అయితే ఆ అనుబంధం ఇంటికే పరిమితం. తండ్రులను సెట్స్ లోకి అనుమతించం. అలాకాకుండా ఆమెకు మేనేజర్ గా ఉండదలచుకుంటే మేనేజర్ గానే వ్యవహరించండి. ఆసిన్ తో ప్రైవేట్ గా మాట్లాడాలనుకున్నట్టు ప్రైవసీ ఇవ్వండి. అలా కుదరదంటే మీ కళ్లముందే ఆమెతో ఎలా వ్యవహరించాలో నాకు బాగా తెలుసు. ఆసిన్ మీ ముందే ఉంటే ఆమెతో ఎవరూ ఫ్రెండ్ షిప్ చేయరనే భ్రమలు మీకు ఉంటే వాటి నుంచి ఇప్పటికైనా బయటపడండి' అంటూ జోసఫ్ ను సల్మాన్ గట్టిగానే హెచ్చరించినట్టు ఆ వర్గాల కథనం. సల్మాన్ దూకుడు జోసఫ్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందట. ఆ వ్యవహారంపై ఆసిన్ ఎలా స్పందించిందనేది ఇంకా తెలియరాలేదు.
News Posted: 24 March, 2009
|