హోం మినిస్టర్ అమర్ సింగ్!
న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్ హోం మంత్రి కాబోతున్నారు! బాలివుడ్ ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ తీస్తున్న సినిమా ఛార్జి షీట్ లో! 'నేను ఎప్పుడూ మంత్రి పదవి చేపట్టలేదు. అవాలనే ఉద్దేశం కూడా లేదు. కాని దేవ్ సాహెబ్ వచ్చి అడగ్గానే కాదనలేకపోయాను. ఆయన దయవల్ల నేను హోం మంత్రిని కాబోతున్నాను. అది కూడా ఒక్క రోజు మాత్రమే' అని అమర్ సింగ్(53) విలేఖరులతో చెప్పారు. ఆయన పక్కనే ఎనభై ఐదేళ్ల దేవానంద్ ఉన్నారు చిరునవ్వులు చిందిస్తూ. బాలివుడ్ సెలిబ్రిటీలతో సన్నిహితంగా మెలిగే అమర్ సింగ్ గతంలో కొన్ని హిందీ, బెంగాలీ సినిమాల్లో రాజకీయ నాయకుడి వేషాలు వేశారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా సింగ్ చాలా బిజీగా ఉంటారని తెలిసిన దేవానంద్ తన సినిమాలో ఆయన కనిపించే సన్నివేశాలను ఇక్కడి లోధి ఎస్టేట్స్ లోని ఆయన అధికార నివాసంలో రెండు రోజులపాటు చిత్రీకరించడానికి అంగీకరించారు. తాను దేవానంద్ వీరాభిమానిని అనీ, చిన్నతనంలో ఆయన సినిమాలు చూడడానికి గంటల తరబడి క్యూలో నిలుచునే వాడిననీ, ఓక్కోసారి టిక్కెట్లకు బదులు పోలీసుల లాఠీ దెబ్బలు దొరికేవనీ, దాంతో దేవానంద్ సినిమా చూడ్డానికి నెలల తరబడి ఎదురుచూడవలసి వచ్చేదనీ అమర్ సింగ్ వివరించారు.
News Posted: 24 March, 2009
|