షాహిద్ గూటిలో ప్రియాంక!
హిందీలో 'రామ్ బనాయే జోడి' అనే మాట విరివిగా వాడుతుంటారు. దేవుడే ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతాడు అని అర్ధం. ప్రియాంక చోప్రా, షాహిద్ కపూర్ విషయంలో ఇది ఎంతవరకూ వర్తిస్తుందనేది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ ఇద్దరూ తమ ప్రేమను ప్రైవేటు వ్యవహారంగానే గుట్టుగా ఉంచుతున్నారు. తన చిన్ననాటి మిత్రుడు హర్మాన్ బవేజాతో ప్రియాంక, సాహిద్ మొదట కరీనాతోనూ, ఆ తర్వాత సానియాతోనూ చెట్టాపట్టాలేసుకు తిరిగిన సందర్భాల్లోనూ వీరిద్దరూ తమ లవ్ ఎఫైర్ పై 'గుట్టు' పాటిస్తూనే ఉన్నారు. ప్రియాంక, సాహిద్ లు యుక్త వయస్సులో ఉండడం, బ్యాచిలర్ స్టాటస్ దృష్ట్యా వారి మధ్య ఉన్న అనుబంధం గురించి మీడియా ఎప్పుడు ప్రశ్నించినా 'నో కామెంట్' అంటూ తడుముకోకుండా సమాధానం వస్తుంటుంది.
ప్రియాంక, సాహిద్ లు కొంతకాలంగా ఎడమొగం పెడమొగంగా ఉంటున్నారనే వదంతులూ ఆమధ్య వినిపించాయి. హర్మాన్ తో ప్రియాంక చనువుగా ఉండటం, సానియా మీర్జాకు సాహద్ దగ్గర కావడం వంటివి ఈ ఇద్దరి మధ్యా దూరం పెంచాయని అంటారు. విశాల్ భరద్వాజ్ 'కమీనే' చిత్రం పుణ్యమా అని మళ్లీ ఈ ఇద్దరూ దగ్గరయ్యారంటూ తాజా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ తొలిరోజు షూటింగ్ లో పాల్గొన్నప్పటి నుంచి ఎంతో ఉల్లాసంగా గంటల తరబడి ముచ్చట్లలో మునిగితేలుతుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈమధ్యనే చైనా హౌస్ లో సాహిద్ బర్త్ డే పార్టీ జరిగినప్పుడూ ఇద్దరూ ఒకరి సహచర్యాన్ని మరొకరు ఎంతో ఇష్టపడుతూ వచ్చారనీ, ఆయనతో కలిసి అతిథులను ఆహ్వానించడంలో ప్రియాంక బిజీగా కనిపించిందనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. దీనిపై ప్రియాంకను కదిపినప్పుడు 'నా వ్యక్తిగత జీవితం గురించి ఎంతమాత్రం మాట్లాడదలచుకోలేదు' అంటూ తెగేసి చెప్పింది. తాను ఏమి చెప్పినా అది తనపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని ప్రియాంక భయపడుతోందనీ, అందుకే ఆచితూచి మాట్లాడుతోందనీ ఆమె సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ముచ్చట కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కరీమ్ మోరానీ ఈ మధ్యనే ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి సాహిద్, ప్రియాంక వేర్వేరుగా హాజరయ్యారు. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం ఒకే కారు ఎక్కారు.నిజానికి వెర్సావోలోని ఓ బిల్డింగ్ లోనే (పక్కపక్కనే) ఈ ఇద్దరూ ఉంటున్నారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏముంది? పొరుగువారిని ప్రేమించమన్నారు కదా అని అంటారా? నిజమే మరి...
News Posted: 25 March, 2009
|