ఫ్రిదా రేటు 5 కోట్ల పైమాటే!
డానీ బొయిలే 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రానికి ఏ క్షణాన ఎనిమిది ఆస్కార్ అవార్డులు వచ్చాయో ఆ క్షణంలోనే ఆ సినిమాలోని లతిక పాత్రధారి ఫ్రిదా పింటో దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో పాటు బాలీవుడ్ బిగ్ బ్యానర్లూ ఆమె వెంట పడుతున్నాయి. నిజానికి ఆమె షెడ్యూల్స్ ఈజీగానే దొరకబుచ్చుకోవచ్చు. ఎటొచ్చీ అమెరికాలోని ఆమె మేనేజ్ మెంట్ కంపెనీ చెబుతున్న ఫ్రిదా రేటు చూసి ఫిల్మ్ మేకర్స్ బెంబేలెత్తిపోతున్నారట.
మూడు సార్లు ఆస్కార్ సాధించిన వూడీ అలెన్ చిత్రానికి ప్రస్తుతం ఫ్రిదా కమిట్ అయిందనీ, ఇంటర్నేషనల్ కాస్మొటిక్ జెయింట్ 'ఎస్టీ లాడెర్ ' సరికొత్త ఫేస్ గా ఆమె త్వరలో కనిపించోతోందనీ ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆమెరికాలో ఫ్రిదా వ్యవహారాలు చూసే మేనేజ్ మెంట్ కంపెనీ ఆమెకు చెందిన ప్రతి స్క్రిప్టును కూలంకషంగా పరిశీలిస్తున్నాయనీ, ఇవాల్టి జనరేషన్ కు తగ్గట్టుగా ఆమె ప్రాజెక్ట్ లు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటాన్నాయనీ ఆ వర్గాలు వివరించాయి. ఈ క్రమంలో హాలీవుడ్ తో వేళ్లూనుకునేందుకు ఆసక్తి చూపుతున్న పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ సినిమాల్లో ఫ్రిదాను తీసుకునేందుకు, వరుస సినిమాల అగ్రిమెంట్ కూడా సిద్ధపడుతున్నాయి. 'బాలీవుడ్ లో ప్రతి ఒక్కరి వద్ద ఆమె కోసం స్క్రిప్టులు రెడీ గా ఉన్నాయి. ఇక లెక్కకు మించిన బ్రాండ్ లు కూడా ఆమెతో అగ్రిమెంట్ కు ఎదురుచూస్తున్నాయి' అని ఆ వర్గాలు వివరించాయి. అయితే ఫ్రిదా ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాలయకు పైనే డిమాండ్ చేస్తోందనీ, ఇది ఐశ్వర్యారాయ్ కి ఇచ్చే మొత్తం కంటే ఎక్కువనీ వారంటున్నారు. అసలే ఆర్థిక మాంద్య పరిస్థితులతో బాలీవుడ్ పరిశ్రమ కుదేలవుతున్న తరుణంలో ఫ్రిదా డిమాండ్ పలువురికి మింగుడు పడటం లేదట. ఇక ఫ్రిదా వైపు కన్నెత్తి చూడాలంటే బహుశా పెద్ద బ్యానర్లకే సాధ్యం కావచ్చు.
News Posted: 26 March, 2009
|