ఆసిన్ అసిస్టెంట్ దొరికాడు
ఒకే తరహా చిక్కులు రెండుసార్లు ఎదురుకావడం బహుశా నటి ఆసిన్ విషయంలోనే జరిగి ఉండొచ్చు. కొద్దికాలం క్రితం ఆసిన్ ఇంట్లో పనిపిల్ల కనబడలేదంటూ ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆ పనిపిల్లే స్వయంగా కమిషనర్ ముందు తన తల్లికి వ్యతిరేకంగా చెప్పడంతో ఆసిన్ ఆ కేసు నుంచి బయటపడింది. మళ్లీ ఈమధ్య ఆసిన్ అసిస్టెంట్ నల్ల ముత్తుకుమార్ మాయం కావడం ఆసిన్ ను చిక్కుల్లో నెట్టింది. దాదాపు నెలరోజులుగా కొనసాగుతున్న ఈ సస్పెన్స్ కు గురువారంనాడు ఎట్టకేలకు తెరపడింది. ముత్తుకుమార్ పుట్టపర్తిలో ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు.
పొన్నేరు డి.ఎస్.పి.కి ముత్తుకుమార్ ఫోన్ చేసి తాను పుట్టపర్తిలో ఉన్నాననీ, పోలీసులకు లొంగిపోతానని తెలియజేసినట్టు సమాచారం. ఆసిన్ నుంచి డబ్బు గుంజాలనే పన్నాగంతో ఆమెను బెదరించినట్టు కూడా ముత్తుకుమార్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ముత్తుకుమార్ కనిపించకుండా పోయాడంటూ అతని తల్లి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఆసిన్ పైనా, ఆమె తండ్రి జోసఫ్ పైన అనుమానం ఉందని ఆమె పేర్కొంది. అయితే ముత్తుకుమార్ గత జనవరిలోనే ఉద్యోగం నుంచి వెళ్లిపోయాడనీ, అంతకు ముందు అతనికి ప్రమాదం జరిగితే 2.7 లక్షల రూపాయలకు ఖర్చు చేశామనీ జోసఫ్ పోలీసులకు వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా వారికి సమర్పించారు. దీంతో పోలీసులు ముత్తుకుమార్ వైపు నుంచి పరిశోధించడం మొదలుపెట్టారు. ముత్తుకుమార్ బాగా అప్పులపాలయ్యాడనీ, దీని నుంచి బయటపడేందుకే ఆసిన్ ను బెదరించి డబ్బులు గుంజాలనే పథకం వేశాడనీ పోలీసులకు ఆధారాలు దొరికాయి. పోలీసులు చెన్నై, ఆ పరిసర ప్రాంతాల్లోనూ ముత్తుకుమార్ జాడ కోసం మమ్మురంగా గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ముత్తుకుమార్ తనంత తానుగా బయటపడి లొంగిపోవాడానికి సిద్ధపడటంతో మిస్టరీ వీడింది. ఆసిన్ కూ ఈ కేసు నుంచి రిలీఫ్ దొరికింది.
News Posted: 26 March, 2009
|