శిల్ప-రాజ్ పెళ్లి అక్టోబర్ లో
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి వచ్చే అక్టోబర్ లో తన బాయ్ ఫ్రెండ్, దుబాయ్ బేస్డ్ బిజినెస్ మన్ రాజ్ కుంద్రాతో మెడలో మూడుముళ్లు వేయించుకోనుందంటూ ముంబై పత్రికలు ప్రముఖంగా పేర్కొంటున్నాయి. అక్టోబర్ లో ఒక తేదీని నిశ్చయించుకుని ఇండియాలోనే సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగేలా వీరు ప్లానింగ్ చేస్తున్నట్టు ఆ వార్తల సారాంశం.
సంప్రదాయ వివాహాల పట్ల తనకు ఎంతో నమ్మకమనీ., వివాహాలు స్వర్గంలోనే నిశ్చయమవుతాయని తాను బలంగా నమ్ముతాననీ శిల్పాశెట్టి పేర్కొంది. వివాహం గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా తనకు కాబోయే సరైన వ్యక్తి ఎవరని అనుకునే దాన్ననీ, అలాంటి వ్యక్తి రాజ్ అని క్రమంగా తాను తెలుసుకున్నాననీ ఆమె చెప్పుకొచ్చారు. 'నా మనసును దోచుకున్న వ్యక్తి రాజ్ అని నిశ్చయంగా చెప్పగలను' అని శిల్ప పేర్కొంది. శిల్పా తల్లిదండ్రులతో తాను మాట్లాడాననీ, ఇండియన్ ట్రెడిషన్ ప్రకారమే తమ వివాహం ఉంటుందనీ రాజ్ కుంద్రా తెలియజేశారు. ఇండియాలో పెళ్లికి కొద్ది రోజుల ముందువరకూ కలిసి తిరగడం ఉండదనీ, ఈ ఏడాది తప్పనిసరిగా తాము వివాహబంధంతో ఏకమవుతాయనీ ఆయన వివరణ ఇచ్చారు. శిల్పా శెట్టి (33) ఇటీవల రాజ్ కుంద్రాతో (34) కలిసి వేబ్రిడ్జిలో 5 మిలియన్ పౌండ్లు ఖరీదు చేసే ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇందులో ఖరైదన బెడ్ రూమ్ లు, ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. దుబాయ్ లో కుంద్రా బిజినెస్ మన్ గా ఉంటూ విలువైన రత్నాలు, మెటల్స్ ట్రేడింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. శిల్పా మేనేజర్ గా వ్యవహరిస్తూ ఆమె కెరీర్ ప్లానింగ్ కు కూడా ఆయన సహకరిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ టీమ్ లో 8 మిలియన్ పౌండ్స్ పెట్టుబడి పెట్టేందుకు శిల్పా తీసుకున్న నిర్ణయం వెనుక కూడా రాజ్ కుంద్రా ఉన్నారు.
News Posted: 30 March, 2009
|