కేరళలో రెహ్మాన్ మెగా షో
'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుని ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ తాజాగా 'గ్లోబల్ టూర్'కు శ్రీకారం చుడుతున్నారు. కేరళలో తొలి లైవ్ కన్సెర్ట్ ద్వారా ఈ టూర్ ను ప్రారంభించబోతున్నారు. 'జై హో' పేరుతో ఏప్రిల్ 3న కోజికోడ్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. హెచ్.ఐ.వి., ఎయిడ్స్ బాధిత పిల్లలకు సంఘీభావం తెలిపేందుకు గ్లోబల్ కేరళ ఇనీషియేటివ్ - కేరళీయం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెహ్మాన్ తో పాటు 50 మందికి పైగా ప్రముఖ మ్యూజిషియన్లు ఈ లైవ్ షోలో పాల్గొంటారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం రెహ్మాన్ చేపడుతున్న తొలి లైవ్ కన్సర్ట్ ఇదే కావడం విశేషం.
రెహ్మాన్ ఇటీవల ఈ విషయాన్ని ముచ్చటిస్తూ, కేరళలో లైవ్ కన్సర్ట్ ఇవ్వాలని 15 ఏళ్లుగా తాను అనుకుంటూనే ఉన్నాననీ, ఇటీవల ఆరు నెలల పాటు అమెరికాలోనే ఉండటం వలన 7 షోలు తాను వదులుకోవలసి వచ్చిందనీ చెప్పారు. అయితే ఈసారి మాత్రం కేరళలో లైఫ్ షో కోసం కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. మలయాళంలో కేవలం కళ కోసమే పుట్టి, దానికి అంకితమైన సింగర్లు ఎందరో ఉన్నారని ప్రశంసించారు. ఎందరో కళాకారుల ఇందుకు బలమైన పునాదులు వేశారని చెప్పారు. తనతో పాటు ఆస్కార్ అవార్డు అందుకున్న కేరళ సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టితో మరోసారి కలిసి పనిచేయబోతున్నట్టు కూడా ఆయన తెలియజేశారు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, లారాదత్, జావిద్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో శ్రీ అష్టవినాయక్ సినీ విజన్ నిర్మిస్తున్న 'బ్లూ' చిత్రం కోసం తాము కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి ఆంధోని డి సౌజ దర్శకత్వం వహిస్తున్నారు.
News Posted: 31 March, 2009
|