బాలీవుడ్ బాక్సాఫీస్ 'వీక్'
మల్టీప్లెక్స్ యాజమాన్యాలకూ, డిస్ట్రిబ్యూటర్లు-నిర్మాతల గిల్డ్ కూ మధ్య లాభాల షేర్ విషయంలో తలెత్తిన వివాదం ఏప్రిల్ 4 నుంచి మరింత ముదరబోతోంది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ లలో కొత్త సినిమాల విడుదల కాకుండా నిర్మాతల గిల్డ్ ఆ రోజు నుంచే నిషేధం విధించనుంది. దీంతో పలువురు నిర్మాతలు నిషేధం అమలుకు ముందే తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత శుక్రవారం సంతృప్తికరమైన రీలీజ్ లు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ రిటర్న్స్ మరీ అంత సంతృప్తిగా లేవంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
'స్టార్ ఆఫ్ ది వీక్'గా సంతోష్ శివన్ తీసిన 'ఏక్ - ది పవర్ ఆఫ్ వన్' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డియోల్, నానా పటేకర్ తదితరులు నటించిన ఈ చిత్రం తెలుగులో మహేష్ బాబు కథానాయకుడుగా విజయవంతమైన 'అతడు' చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి సింగిల్ థియేటర్లలో 30 నుంచి 40 శాతం, మల్టీప్లెక్స్ లలో 20 నుంచి 30 శాతం కలెక్షన్లు వచ్చాయి. జహంగీర్ సుర్తి దర్శకత్వం వహించిన 'ఆ దేఖే జరా' చిత్రానికి మల్టీప్లెక్స్ లలో 30 నుంచి 35 శాతం కలెక్షన్లు లభించగా, ఒకింత తక్కువగా సింగిల్ స్క్రీన్ కలెక్షన్లు ఉన్నాయి. అయితే ఆ తరహా కలెక్ష్లన్లను మాత్రం దీపా మెహతా 'విదేశ్' రాబట్టుకోలేకపోయింది. ప్రీతి జింటా సమ్మోహనాస్త్రం కూడా కనీసమైన ఓపినింగ్స్ ను రాబట్టులేకపోయినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతకు ముందు వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆలూ ఛాట్', 'ఫిరాఖ్', 'స్ట్రయిట్', 'లాటరీ' చిత్రాలు బాక్సాఫీస్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. అయితే అంతకుముందు వారంలో విడుదలైన సూనీ తార్పడ్ వాలా 'లిటిల్ జిజావు' చిత్రం మాత్రం ఆడియెన్స్ ను గణనీయంగా మల్టీప్లెక్స్ థియేటర్లకు రప్పిస్తోంది. వ్యూహాత్మకంగా సెలక్టెడ్ థియేటర్లలో మాత్రమే ఈ సినిమాను విడుదల చేయడంతో 'ఫీల్ గుడ్' మూవీగా ప్రశంసలు అందుకుంటూ మూడోవారంలోకి ప్రవేశించింది. ఇప్పడు అందరి దృష్టీ రాబోయే శుక్రవారంపైనే (ఏప్రిల్ 3) ఉంది. సరిగ్గా 'బ్యాన్'కు ఒకరోజు ముందు '8x10 తస్వీర్' చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఈ చిత్రం
రూపొందింది. 'చాంద్ నీ చౌక్ టు చైనా' చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూడటంతో ఇప్పడు అక్షయ్ కుమార్ తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నారు. అక్షయ్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రంగా ఎదురూచూస్తున్నారు.
News Posted: 31 March, 2009
|