హిందీలో ఆసిన్ 'దశావతారం'
గజనీ' తర్వాత ఆసిన్ మరోసారి 'దశావతారం' హిందీ వెర్షన్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రపంచ సినీ చరిత్రలోనే కమల్ హాసన్ తొలిసారి ఈ చిత్రంలో 10 పాత్రల్లో నటించడం ఓ విశేషమైతే, ఆసిన్ ద్విపాత్రాభినయం చేసింది. తమిళ వెర్షన్ గత ఏడాది జూన్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొమ్మిది నెలల గ్యాప్ తరువాత హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆసిన్ 12, 21వ శతాబ్దాలకు చెందిన అమ్మాయిగా రెండు పాత్రలు పోషిస్తే, ఈ రెండూ బ్రాహ్మణ అమ్మాయి పాత్రలే కావడం ఆసక్తి కలిగించే అంశం. మల్లికా షరావత్, జయప్రద ఇతర కీలక పాత్రలు పోషించారు. తొలుత ఆసిన్ పాత్రకు విద్యాబాలన్ ను అనుకున్నప్పటికీ డేట్ల సమస్య కారణంగా ఆ ఆఫర్ ఆసిన్ ను వరించింది. 'దశావతారం చిత్రం ఆసిన్ కు చాలా మంచి చేసింది. గజనీ చిత్రం తమిళ వెర్షన్ కు ఎంత పేరొచ్చిందో దశావతారం చిత్రంలోని నటనకూ ఆమెకు అంతే పేరు వచ్చింది. గజనీ హిందీ వెర్షన్ గత ఏడాది డిసెంబర్ లో విడుదలైంది. అప్పట్నించీ ఆసిన్ ప్రభ వెలగడం మొదలైంది' అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని ఓ రీసెర్చ్ సైటింస్ట్ కనుగొన్న బయోలాజికల్ వెపన్ అతని చేయి జారుతుంది. సిఐఏ మాజీ అధికారి ఒకరు తన స్వలాభం కోసం ఆ మారణాయుధాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. జాడ తెలియకుండా పోయిన ఆ వెపన్ కోసం సైంటిస్ట్ అన్వేషిస్తుంటే...సిఎఐ మాజీ అధికారి అతన్ని ఛేజ్ చేస్తుంటాడు. టూకీగా దశవతారం ఇతివృత్తం ఈ విధంగా నడుస్తుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఆస్కార్ ఫిలిమ్స్ వి.రవిచంద్రన్ 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులు సృష్టించింది. మెజారిటీ రివ్యూలు సినిమాకు అనూకలంగానే వచ్చాయి. సుమారు 3 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం పూర్తి కావడానికి దాదాపు 3 ఏళ్లు పట్టింది. హిమేష్ రేషమ్మియా సౌండ్ ట్రాక్ ఈ చిత్రానికి మరో ప్రధానమైన హైలైట్.
News Posted: 2 April, 2009
|