బరజాత్య సినిమాలో తమన్నా
థింక్ బిగ్. ఎట్ లీస్ట్ యు గెట్ సమ్ థింగ్...అనేది అందాల నటి తమన్నా విషయంలో నిజమవుతోంది. ముంబై అమ్మాయి అయిన తమన్నా మోడలింగ్ నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 13 ఏళ్ల ప్రాయంలోనే 'ఛాంద్ సే రోషన్ చెహ్రా' సినిమాలో తమన్నా నటించింది. ఆ తర్వాత తెలుగులో మంచు మనోజ్ కుమార్ తో 'శ్రీ' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమమైంది. అనంతరం తమిళంలో 'కేడీ' సినిమాలో నటించింది. ఆ రెండు చిత్రాలు ఫ్లాప్. ఆ తర్వాత శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్'తో తమన్నా దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. ఆ వెంటనే తమిళంలో విడుదలైన 'కల్లూరి' చిత్రం మంచి సక్సెస్ సాధించి ఆమెకు అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఆఫర్లు ఒప్పుకుంటూ సోలో హీరోయిన్ గానే కొనసాగుతానని ధీమాగా చెబుతోంది. తాజాగా తమన్నాతో తమిళ, తెలుగు వెర్షన్లలో ఆస్కార్ సంస్థ నిర్మించిన 'ఆనంద తాండవం' విడుదలకు సిద్ధంగా ఉండగా, కందేన్ కాదలియా', 'పయ్యా' చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. పనిలో పనిగా ఇప్పుడు బాలీవుడ్ వైపు కూడా ఆమె అడుగులు వేస్తోంది. ఆసక్తికరంగా బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా పలు సిల్వర్ జూబ్లీ హిట్లిచ్చిన రాజశ్రీ ప్రొడక్ష్స్ తదుపరి చిత్రంలో హీరోయిన్ అవకాశం తమన్నాను వరించినట్టు సమాచారం.
'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాత్ సాత్ హై', 'వివాహ్' వంటి బిగ్గెస్ట్ హిట్లు రాజశ్రీ బ్యానర్ లో అందించిన సూరజ్ బరజాత్య ఇప్పుడు తమన్నాకు ఆఫర్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనిపై తమన్నాను సంప్రదించగా 'హిందీలో నటించకూడదని ఏమీ లేదు. అయితే ప్రస్తుతం నా దృష్టంతా తెలుగు, తమిళ సినిమాల వైపే ఉంది. బరజాత్య ఆఫర్ ఇచ్చిన విషయంలో నిజం కూడా లేకపోలేదు. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి వస్తే సంతోషమే' అంటూ చెప్పుకొచ్చింది. 'వివాహ్' తో అమృతారావు దశ తిరిగినట్టు బరజాత్య చిత్రంతో తమన్నాకు హిందీలోనూ డిమాండ్ పెరగవచ్చు.
News Posted: 4 April, 2009
|