220 ప్రింట్లతో 'దశావతారం'
విలక్షణ నటుడు కమల్ హాసన్ 'దశావతారం' చిత్రం ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే కమల్ తొలిసారి 10 పాత్రల్లో నటించిన ఈ చిత్రం సుమారు ఏడాది క్రితం తమిళంలోనూ, ఇతర భాషల్లో అనువాద రూపంలోనూ విడుదలైంది. ఎట్టకేలకు ఇప్పుడు హిందీలో ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. 220 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సన్నాహాలు చేస్తున్నారు. 'గజనీ' ఫేమ్ ఆసిన్ ఇందులో ద్విపాత్రాభినయం చేయగా, మల్లికా షెరావత్, జయప్రద ఇతర కీలక పాత్రలు పోషించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు.
కమల్ హాసన్ కు హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉందనీ, గతంలోనూ కమల్ నటించిన 'ఏక్ దుఝే కేలియే', 'సద్మా', 'సాగర్', 'చాచీ 420' వంటి చిత్రాలు హిందీలో విజయవంతమయ్యాయనీ రవిచంద్రన్ తెలిపారు. కమల్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని హిందీలో 220 ప్రింట్లతో సినిమా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. గత ఏడాది ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించిందనీ, కొద్దిగా ఆలస్యమైన హిందీలోనూ అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. కమల్ పాటు ఇందులో నటించిన మల్లిక, జయప్రద వంటి ఆర్టిస్టులు ఉత్తరాదిన కూడా బాగా పాపులర్ అనీ, అలాగే హిమేష్ రేషమ్మియాకు సంగీత దర్శకుడిగా మంచిపేరుందనీ తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హిందీ ఆడియెన్స్ వద్దకు తన సినిమా వెళ్తుండటం పట్ల కమల్ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ తనకు గణనీయమైన మార్కెట్ ఉందనీ, ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ తెలిపారు. ఈ చిత్రం ప్రీమియర్ కు ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ ను ఆహ్వానిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
News Posted: 6 April, 2009
|