కలిసిన ఖాన్ లు...
ఒక యుద్ధం ముగిసింది. ప్రత్యర్థులు ఇద్దరూ తమ వైరం మరచి దగ్గరయ్యారు. మరో 'యుద్ధానికి' సమాయత్తమవుతున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ ఖాన్ లు షారూక్, అమీర్ ల గురించే ఈ ముచ్చట. స్టార్ రేస్ లో ఉప్పూనిప్పుగా ఉండే వైరి వీరులైన ఈ ఇద్దరూ మల్టీప్లెక్స్ లపై న్యూ యునైట్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఫోరం చేపడుతున్న పోరాటం కోసం చేతులు కలిపారు.
ఈ ఇద్దర్నీ మంగళవారంనాడు ఒకే వేదికపైకి తీసుకువచ్చి కరణ్ జోహర్ ముందుగానే 'స్టార్ ఖాన్ ల ఫ్రెండ్ షిప్ గురించి ప్రశ్నలు వేయకండి. రెవెన్యూ షేరింగ్ విషయంలో మల్టీప్లెక్స్ లకూ, నిర్మాతలకు మధ్య జరుగుతున్న గొడవే కీలకాంశం' అంటూ మీడియాకు సూచించారు. మల్టీప్లెక్స్ లో సినిమాల్లో ప్రదర్శన ద్వారా వచ్చే లాభాల్లో 50-50 వాటా కోసం నిర్మాతల ఫోరం ఈ పోరాటానికి దిగింది. షారూక్, అమీర్ లతో పాటు అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, సాజిద్ నడియడ్ వాలా, రితీష్ సిద్వాని, మన్మోహన్ శెట్టి, రాకేష్ రోషన్ లతో సహా సుమారు 30 మంది అగ్ర నిర్మాతలు ఈ పోరాటంలో ముందున్నారు. ఇది 'పవర్ షో' ఎంతమాత్రం కాదని షారూక్ నవ్వుతూ చెప్పారు. తాము మల్టీప్లెక్స్ లను బెదరించడం లేదనీ, న్యాయసమ్మతమైన రైట్స్ కోసమే తాము పోరాటం చేస్తున్నామనీ అన్నారు. 50-50 లాభాలకు అంగీకరించేంత వరకూ ఏ సినిమా కూడా విడుదల చేయరాదని నిర్మాతలు నిశ్చయించినట్టు అమీర్ తెలిపారు. ముఖ్యంగా ఇది చిన్న నిర్మాతలు, కొత్త నిర్మాతల కోసం చేస్తున్న పోరాటమనీ, వారం రెండు వారాల్లో వారు కూడా తమతో కలుస్తారనీ, అప్పుడు ఎలాంటి రిలీజ్ లు ఉండవనీ ఆయన పేర్కొన్నారు. పరిస్థితుల్లో మార్పు లేకపోతే సింగిల్ థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్ లు, నిర్మాతల మధ్య ఏకాభిప్రాయనికి రావడానికి ఎంత కాలం పట్టినా సరే నిరవధికంగా పోరాటం చేస్తామని యుటీవి హెడ్ రోనీ స్క్రూవాలా పేర్కొన్నారు.
News Posted: 8 April, 2009
|