అక్షయ్-ట్వింకిల్ అరెస్టు?
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేయవచ్చు. ఈ ఇద్దరితో పాటు 'లక్మే ఫ్యాషన్ వీక్' నిర్వాహకులను కూడా అరెస్టు చేసే యోచనలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
లెవీస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అక్షయ్ కుమార్ మార్చి 31వ తేదీన 'లక్మే ఫ్యాషన్ వీక్ 'లో ర్యాంప్ వాక్ సందర్భంగా దూకుడుగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. ర్యాంప్ నుంచి నేరుగా ట్వింకిల్ కూర్చున్న చోటుకు వచ్చిన అక్షయ్ తన ఫ్యాంట్ బటన్ విప్పాల్సిందిగా ఆమెను కోరారు. మొదట్లో తటపటాయించిన ట్వింకిల్ చివరకు అక్షయ్ చెప్పినట్టే చేసి ఫ్యాంట్ బటన్ తీసింది. ఈ సంఘటన కొంత కలకలం రేపింది. పబ్లిక్ లో 'బరితెగింపు' వ్యవహారాన్ని పాల్పడిన అక్షయ్ జంటపైన, షో నిర్వాహకుల పైన సామాజిక సేవా కార్యకర్త అనిల్ నాయిర్ రెండ్రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'త్వరలోనే అరెస్టులు చేసి వారి స్టేట్ మెంట్లు కూడా తీసుకుంటాం' అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ మహబ్ది తెలిపారు. అయితే ఇంతవరకూ పోలీసుల నుంచి ఎలాంటి సమన్లు రాలేదని అక్షయ్ తరఫు ప్రతినిధి సంచిత వివరణ ఇచ్చారు. పోలీసులు తమను అప్రోచ్ అయిన వెంటనే తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు. అక్షయ్ జంటపై చేసిన అభియోగాలు బెయిల్ కు యోగ్యమే అయినప్పటికీ, దోషులని తేలితే మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరిపై మీరట్ లో ఒక కేసు కూడా నమోదైంది. దీనిపై ఈనెల 13న విచారణ జరుగుతుంది.
News Posted: 8 April, 2009
|