ట్వింకిల్ అరెస్టు..విడుదల
ముంబై: శాంతాక్రుజ్ హోటల్ లో ఇటీవల జరిగిన లక్మే ష్యాషన్ షోలో 'అసభ్య ప్రవర్తన'కు పాల్పడిన అభియోగంపై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను వకోలా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 950 రూపాయల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేశారు. ట్వింకిల్ తన లాయర్ భైరవ్ చౌదరితో కలిసి వచ్చి లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. ట్వింకిల్ అరెస్టు వార్త తెలియడంతో పెద్ద ఎత్తున జనం పోలీసులు స్టేషన్ వద్ద గుమిగూడారు. ట్వింకిల్ సుమారు రెండు గంటల సేపు స్టేషన్ లో ఉన్నారు. ఈ వారాంతంలో అక్షయ్ ముంబై చేరుకుంటారనీ, ఆయన వచ్చిన వెంటనే లీగల్ ఫార్మలిటీలు పూర్తి చేయగలమని ట్వింకిల్ పోలీసులకు తెలియజేసినట్టు సమాచారం.
ఇది బెయిలుకు అవకాశమున్న నేరమనీ, పోలీసు స్టేషన్ లోనే 950 రూపాయలు కట్టించుకుని ఆమెను విడిచిపెట్టామనీ, అక్షయ్ కోసం ఎదురు చూస్తున్నామనీ వకోలా డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ అరవింద్ మహాబ్ది తెలిపారు. పబ్లిక్ గా అసభ్య ప్రవర్తనకు పాల్పడిన అక్షయ్-ట్వింకిల్ జంటపై చర్య తీసుకోవాలంటూ సోషల్ వర్కర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన చట్టాలు బలహీనంగా ఉన్నందున తాము పెద్దగా పరిశీలించేది ఏమీ ఉండకపోవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 'అక్షయ్ ట్రౌజర్ బటన్ విప్పించే విషయంలో ర్యాంప్ పై ఉన్న ఇతరుల వద్దకు కాకుండా నేరుగా తన భార్య వద్దకే వెళ్లారు' అని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. 'అసభ్య ప్రవర్తన' అభియోగంపై నటులు అరెస్టు కావడం, 950 రూపాయల పూచికత్తుపై విడుదల కావడం ఇది మొదటి సారి కూడా కాదు. స్పోర్ట్స్ షూ కమర్షియల్ యాడ్ లో 'అబ్సినిటీ'కి పాల్పడిన అభియోగంపై సప్రే, మిలంద్ సోమన్ గతంలో అరెస్టయ్యారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. 'రగ్' సినిమా పోస్టర్ విషయంలో పూజా భట్ అరెస్టయి బెయిలుపై విడుదలైంది. శిల్పాశెట్టి-రీమాసేన్ పాక్షిక నగ్న పోస్టర్ల వ్యవహారంలో మధురైకి చెందిన లాయర్ ఒకరు స్థానిక కోర్టుకు వెళ్లారు. ముంబై సిటీలో న్యూఇయర్ ఈవెంట్ జరిగినప్పుడు అశ్లీల చర్యలకు పాల్పడిందంటూ మల్లికా షెరవాత్ ను ఓ సామాజిక కార్యకర్త కోర్టుకు ఈడ్చారు.
News Posted: 10 April, 2009
|