హిందీలో వర్మ 'రక్తచరిత్ర'
రియలిస్టిక్ చిత్రాలను తీయడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ఈ తరహా ప్రయోగాలు ఒక్కోసారి బెడిసికొట్టినా తన అప్రోచ్ లో ఎలాంటి మార్పు లేదంటున్నారు. ఇందులో భాగంగానే కొద్దికాలంగా ఆయన దివంగత ఫ్యాక్షన్ లీడర్ పరిటాల రవి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు రవి భార్య, సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఆ చిత్రం ప్రోగ్రస్ ఎవరికీ తెలియకపోవడంతో ఈ సినిమా మూలనపడినట్టేనని అంతా భావిస్తూ వచ్చారు. ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనీ, అయితే ఈ చిత్రాన్ని తెలుగులో కాకుండా హిందీలో చేయబోతున్నాననీ వర్మ తాజాగా వివరణ ఇచ్చారు.
'మోస్ట్ డేంజరస్ మన్ గా భావించే ఎల్.టి.టి.ఇ. అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్, కొలంబియన్ డ్రగ్ లార్డ్ దావూద్ ఇబ్రహీం వంటి చాలామంది బయోగ్రఫీ చదివాను. అయితే వారందరి కంటే పరిటాల రవి జీవితం చాలా వైవిధ్యమైనది. ఇందుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల దగ్గర చాలా సమాచారం కూడా సేకరించాను. తెలుగులో కాకుండా హిందీలో తీస్తే రీచ్ పెరుగుతుంది. ఎక్కువ మంది ఆడియెన్స్ కు చేరుతుంది. అందుకే హిందీలో సినిమా తెరకెక్కించబోతున్నాను' అని వర్మ తెలిపారు. పరిటాల రవి జీవిత విశేషాలను అన్నీ కవర్ చేస్తూ సినిమా తీయాలంటే కనీసం 5 గంటల నిడివి అవసరమవతుందనీ, ఇందుకు తగ్గట్టుగానే రెండు పార్ట్ లుగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. 'రక్త చరిత్ర-1' విడుదలైన మూడు నెలల్లోనే 'రక్తచరిత్ర 2' ప్రేక్షకుల ముందుకు తెస్తామని పేర్కొన్నారు. పరిటాల రవి పాత్రలో ఒక హిందీ హీరోని ఎంపిక చేస్తామనీ, ఆగస్టులో చిత్ర నిర్మాణం ప్రారంభిస్తామనీ చెప్పారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 'ఇండియా 24x7' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీడియా వరల్డ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ హీరో నితిన్, నిషా కొఠారీ జంటగా హిందీలో రూపొందుతున్న 'అజ్ఞాత్' చిత్రం విడులకు సిద్ధంగా ఉంది.
News Posted: 13 April, 2009
|