ఆసిన్ కు 'ఇఫ్టా' అవార్డు
ఆమె దక్షిణాదిలో సంచలన కథానాయిక. బాలీవుడ్ లో అడుగుపెట్టి తొలిసారిగా ఆమె నటించిన చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా రికార్డులు సృష్టించింది. ఆమె ఆసిన్ అని తేలిగ్గానే గ్రహించవచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు జోడిగా ఆమె 'గజనీ' చిత్రంలో హిందీలో అరంగేట్రం చేశారు. ఆ చిత్రం సాధించిన సంచలన విజయంతో ఆసిన్ కు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు జోడిగా 'లండన్ డ్రీమ్స్' లో ఆసిన్ నటిస్తోంది. కమల్ హాసన్ తో ఇండో-జపనీస్ ఫిల్మ్ '19 స్టెప్స్'లోనూ ఆసిన్ నటించనుంది. తాజాగా ఆమె ప్రతిభకు మరో మంచి గుర్తింపు లభించింది. సింగపూర్ కు చెందిన ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ (ఇఫ్టా) ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డులలో భాగంగా ఆసిన్ కు ఉత్తమ నటి అవార్డును ప్రకటించింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ కథానాయకుడుగా విజయవంతమైన తమిళ 'దశావతారం' చిత్రంలో నటనకు గాను ఆసిన్ కు ఈ అవార్డు దక్కింది.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన 'దశావతారం' చిత్రంలో ఆసిన్ రెండు జనరేషన్లకు చెందిన బ్రాహ్మణ యువతిగా ద్విపాత్రాభినయం చేసింది. తమిళ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రముఖులు, నటీనటులకు 'ఇఫ్టా' ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటుంది. ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవం మే 16న సింగపూర్ లో జరుగనుంది.
News Posted: 18 April, 2009
|