రుబీనా అలీ తండ్రి అరెస్టు
లండన్: 'స్లమ్ డాగ్ మిలయనీర్'లో తన నటనతో అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఇట్టే ఆకట్టుకున్న బాలనటి రుబీనా అలీ తండ్రి రఫీక్ ఖురేషిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేరినట్టు బ్రిటిష్ పత్రిక 'ది సన్' తెలియజేసింది తొమ్మిదేళ్ల రుబీనాను 2 లక్షల పౌండ్లకు తెగనమ్మేందుకు ప్రయత్నిస్తున్న కారణంగానే ఖురేషిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు పేర్కొంది. ఖురేషి మాజీ భార్య ఖుర్షీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చోటుచేసుకుందని తెలిపింది.
తన కుమార్తె రుబీనాను దుబాయ్ కి చెందిన ఓ ధనవంతుడికి అమ్మాలనే యోచనలో ఖురేషీ ఉన్న విషయం రెండు వారాల క్రితమే తనకు తెలిసిందని, అయితే తాను నమ్మలేకపోయాననీ ఖుర్షీదా పేర్కొన్నట్టు ఈ పత్రిక తెలిపింది. తన భర్త, అతని కొత్త పెళ్లాం మినా డబ్బు దురాశాపరులనీ, తన తొమ్మిదేళ్ల పాపకు వచ్చిన పేరును డబ్బురూపంలోకి మార్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారనీ ఖుర్షీదా వాపోయింది. 2001లో ఖురేషితో ఆమె విడిపోయింది. కాగా, రుబీనాను దుబాయ్ ధనవంతుడికి అమ్మడానికి ఖురేషి ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలపై ఖుర్షీదా తీవ్ర మనస్థాపానికి గురైందనీ, ఈమేరకు ఆమె ఒక ఫిర్యాదు కూడా ఇచ్చిందనీ ఈ కేసు దర్యాప్తునకు సారధ్యం వహిస్తున్న పోలీసు అధికారి ప్రకాష్ సాలుంకే ధ్రువీకరించారు. ఆమె బాధను అర్ధం చేసుకున్నామనీ, తగినదర్యాప్తు జరిపి ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈ విషయమై తాము రుబీనాను ప్రశ్నించామనీ, అయితే తాను ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదనీ, తండ్రితోనే ఉండాలనుకుంటున్నాననీ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. రఫీక్ ఖురీషీ సైతం తన పిల్లను అమ్ముకోవాలనే ఆలోచన తనకు లేదని చెప్పడం విశేషం. కాగా, సోమవారం రాత్రి ఖురేషిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు అతన్ని కొద్ది గంటల సేపు ప్రశ్నించారనీ, రుబీనాను అమ్మేందుకు అతను దుబాయ్ ఫ్యామిలీని కలుసుకున్నారని చెబుతున్న సంఘటనకు సంబంధించి సరైన సాక్ష్యాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ 'ది సన్' పేర్కొంది.
News Posted: 21 April, 2009
|