మల్టీప్లెక్స్ 'షో'ల నిలిపివేత!
లాభాల 'వాటా' (50-50) విషయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలకూ, నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్ల గిల్డ్ కూ మధ్య బాలీవుడ్ లో తలెత్తిన సంక్షోభం మరింత ముదురుతోంది. నిర్మాతల గిల్డ్ ప్రారంభించిన స్ట్రయిక్ మూడోవారంలోకి అడుగుపెట్టడంతో కొత్త రిలీజ్ లు లేక ప్రేక్షకులు మల్టీప్లెక్స్ ల వైపు తొంగిచూడటంలేదు. దీంతో ముంబైలోని మల్టీప్లెక్స్ లు ఎడారి వాతావరణాన్ని తలపిస్తూ బోసిగా కనిపిస్తున్నాయి. టిక్కెట్ కౌంటర్లు దాదాపు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇటు మల్టీప్లెక్స్ సిండికేట్ కానీ, అటు నిర్మాతల గిల్డ్ కానీ వెనక్కి తగ్గకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.
మల్టీప్లెక్స్ వర్గాల సమచారం ప్రకారం ఒక్కో స్క్రీన్ కూ 1.5 నుంచి 2 లక్షల వరకూ నష్టం వాటిల్లుతోందని తెలుస్తోంది. దీంతో కరెంట్ బిల్, మెయింటనెన్స్, సిబ్బంది జీతభత్యాలను భరించడం కష్టమని తోచిన మల్టీప్లెక్స్ ఓనర్లు సినిమా ప్రదర్శనలు నిలిపివేయడానికి సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు నిర్మాతల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తీసిన సినిమాల విడుదలలో జరుగుతున్న జాప్యం వీరిని తలపట్టుకునేలా చేస్తోంది. ఎరోస్ ఇంటర్నేషనల్ 'అలాద్దీన్', యూటీవీ 'కమీనే', 'మై ఔర్ మిసెస్ ఖన్నా', బోనీకపూర్ 'వాంటెడ్', వసు భగ్నాని 'కల్ కిస్నే దేఖా హై', సాజిద్ నడియడ్ వాలా 'కంబక్త్ ఇష్క్' వంటి పలు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు ఎదురుతెన్నులు చూస్తున్నాయి.
News Posted: 22 April, 2009
|