పరిటాల రవిగా వివేక్
ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ హిందీలో తెరకెక్కించినున్న 'రక్తచరిత్ర' చిత్రానికి కథానాయకుడిగా వివేక్ ఒబెరాయ్ ను ఎంచుకున్నారు. 'కంపెనీ' చిత్రం ద్వారా వివేక్ ను పరిచయం చేసింది కూడా వర్మ కావడం విశేషం. ఆ తర్వాత వర్మ తీసిన మరో రెండు చిత్రల్లోనూ ఆయన నటించారు. ఇన్నాళ్లకు మళ్లీ వర్మ చిత్రంలో నటించే ఛాన్స్ ను వివేక్ అందబుచ్చుకున్నారు. పరిటాల రవి జీవితానికి సంబంధించిన కథతో 'రక్త చరిత్ర' రెండు భాగాలుగా తెరకెక్కునుండటం విశేషం. తొలి భాగం వచ్చే జనవరిలోనూ, రెండో భాగం ఏప్రిల్ లోనూ విడుదల చేసేందుకు వర్మ ప్లానింగ్ చేస్తున్నారు. తొలుత తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తీయాలని వర్మ అనుకున్నప్పటికీ ఎక్కువ మంది ఆడియెన్స్ కు రీచ్ కావాలనే ఉద్దేశంతో హిందీలోనే ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
వివేక్ ఎంపిక గురించి వర్మ వివరిస్తూ 'పరిటాల రవి జీవితానికి సంబంధించి చాలా సమాచారం సేకరించాను. ఆయన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాను. వేలుపిళ్లై ప్రభాకరన్, దావూద్ చరిత్రలతో పోలిస్తే పరిటాల రవి జీవితం చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. చాలా దమ్మున్న కథ ఇది. జంగిల్స్ లో రెబల్ గా మారడం దగ్గర నుంచి స్ట్రాంగ్ పొలిటీషియన్ గా మారడం వరకు రవి జీవితంలోని వివిధ కోణాలను ఇందులో చూపిస్తాం. అందుకు తగిన నటుడి కోసం పేరున్న నటులతో పాటు కొత్తవారిని కూడా ఎన్నో కోణాల నుంచి పరిశీలించాం. చివరకు వివేక్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని భావించి ఆయనను ఎంపిక చేశాం' అని తెలిపారు. వివేక్ కళ్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయనీ, కావాల్సిన ఎమోషన్ ఆయన కళ్లతో చూపించగలరనీ, 'కంపెనీ' సినిమా తీస్తున్న సమయంలోనే ఈ విషయాన్ని తాను గ్రహించాననీ చెప్పారు. గొంతులోని గాంభీర్యం కూడా ఆయనకు ప్రధాన ఆకర్షణ అని అన్నారు. పరిటాల రవిగా వివేక్ లుక్ ను వివిధ కోణాల్లో పరిశీంచామనీ, అతని ఎంపికతో తన అన్వేషణ పూర్తయిందనీ చెప్పారు.
News Posted: 27 April, 2009
|