'దేవ్- ఫ్రిదా ప్రేమ నిజమే'
'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో ప్రేమజంటగా నటించిన దేవ్, ఫ్రిదా నిజజీవితంలోనూ 'ప్రేమ'లో పడ్డారని దేవ్ తల్లి అనితా పటేల్ పేర్కొన్నట్టు ఓ వార్తా కథనం బయటకు వచ్చింది. ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ, డేటింగ్ కూడా చేస్తున్నారంటూ ఇటీవల పలు ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదనీ, తామిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమేనంటూ దేవ్, ఫ్రిదా ఆ వదంతులను ఇటీవల తోసిపుచ్చారు. అయితే తాజాగా ఇజ్రాయల్ లో ఇద్దరూ ఇంటిమేట్ లంచ్ డేట్ ను ఎంజాయ్ చేస్తుండటం పలువురి దృష్టిలో పడింది.
'ఫ్రిదా చాలా అందంగా ఉంటుంది. వారిది చూడముచ్చటైన జంట. ఆమెతో ఉంటే అంతకంటే మంచి జీవితం మరొకటి ఉంటుందని దేవ్ అనుకుంటున్నాడు. వాళ్లిద్దరూ ప్రేమలో పడటం మాకు కూడా సంతోషం కలిగిస్తోంది' అని అనిత తెలిపారు. ఫ్రిదాను కలుసుకోవడానికే దేవ్ ఇజ్రాయల్ వెళ్లినట్టు ఆమె ధ్రువీకరించారు. దేవ్, ఫ్రిదాల మధ్య 'స్లమ్ డాగ్ మిలయనీర్' షూటింగ్ సమయంలోనే ప్రేమ చిగురించింది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం పలు ప్రపంచ దేశాల్లో కలిసి పర్యటించినప్పుడు ఆ ప్రేమ మరింత బలపడుతూ వచ్చింది.
News Posted: 27 April, 2009
|