ప్రభాకరన్ గా ప్రకాష్ రాజ్
తమిళ ఈలం విముక్తి పులుల (ఎల్.టి.టి.ఇ.) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రను తాను పోషించనున్నట్టు బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఓ తమిళ చిత్రం కోసం ప్రభాకరన్ పాత్రను పోషించనున్నానని కర్నాటక ఫిలిమ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన 'ముఖాముఖీ'లో ప్రకాష్ రాజ్ తెలియజేశారు.
'స్క్రిప్టు డిమాండ్ చేసిన మేరకు దర్శకుడు కోరినట్టుగా నటించడానికే నేను ఇష్టపడతాను. ప్రత్యేకించి హోమ్ వర్క్ అంటూ ఉండదు. అప్పటికప్పుడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుందని వ్యక్తిగతంగా నా అభిప్రాయం' అని ప్రభాకరన్ పాత్రకు తీసుకోనున్న జాగ్రత్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఏ నిర్మాత ఈ చిత్రాన్నితీస్తున్నారనే వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. నిజ జీవిత పాత్రలను పోషించడం ప్రకాష్ రాజ్ కు ఇది కొత్త కాదు. మణిరత్నం 'ఇరువర్' చిత్రంలో ఆయన తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎం.కరుణానిధి (యంగ్ కరుణానిధి) పాత్రను పోషించారు. రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ గా కృష్ణవంశీ 'అంత:పురం'లో నటించారు. కెరీర్ లో మూడు సార్లు జాతీయ అవార్డులు, 18 సార్లు రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. 'యాక్టింగ్ కెరీర్ అనేది నాకు ఓ జర్నీలాంటింది. ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం నటన ద్వారా కలిగింది. కెరీర్ లో భాగంగా ఎందరెందర్నో కలుసుంటూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. అనుభవం వల్లనే ఏ నటుడైనా పరిణతి చెందుతాడు.తనపై తనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అనేకమంది దర్శకులు, మంచి నటులతో పనిచేస్తున్నప్పుడు మనం కూడా పోటీపడి నటించి మంచి షాట్ ఇవ్వగలుగుతాం' అని ప్రకాష్ రాజ్ తన కెరీర్, నటనను విశ్లేషించి చెప్పారు.
News Posted: 30 April, 2009
|