బాలివుడ్ నష్టం 50 కోట్లు
ముంబాయి: హిందీ చలనచిత్ర పరిశ్రమ సమ్మె ఐదో వారంలో ప్రవేశించడంతో నష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్మాణం పూర్తయిన కంబఖ్త్ ఇష్క్, బ్లూ, న్యూయార్క్ వంటి వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకోవలసి వచ్చింది. సినిమాల ప్రమోషన్ పనులు కూడా నిలిచిపోయాయి. గత నెల రోజుల్లో పరిశ్రమ 50 కోట్ల రూపాయల నష్టాలను పౌందినట్టు నిర్మాత ముఖేష్ భట్ తెలిపారు. కనీసం వచ్చే వారమైనా సమ్మె విరమణ జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సినిమాల ద్వారా వచ్చే రెవెన్యూలను పంచుకోవడంలో వాటాలపై నిర్మాతలు, మల్టీప్లెక్స్ యజమానులకు మధ్య అభిప్రాయ భేదాలు బాలివుడ్ లో సమ్మెకు దారితీశాయి. నిర్మాతలు రెవెన్యూలో సగం వాటా డిమాండ్ చేయగా, మల్టీప్లెక్స్ యజమానులు అందుకు అంగీకరించలేదు. సినిమా హిట్ అయితేనే సగం వాటాకు అంగీకరిస్తామని వారు షరతు విధించారు. దీని ప్రకారం సినిమా ఫ్లాప్ అయితే మొత్తం నష్టాలను భరించవలసి ఉంటుంది. ఈ సమ్మె వల్ల హోర్డింగుల తయారీ, అడ్వర్టయిజింగ్ తదితర అనుబంధ పరిశ్రమలు కూడా పని లేక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
News Posted: 4 May, 2009
|