'అరుంధతి'గా ఐశ్వర్య
ఈ ఏడాది తెలుగులో ఇంతవరకూ విడుదలైన చిత్రంలో సూపర్ హిట్ అయిన 'అరుంధతి' చిత్రం ఇప్పటికీ తన హవా కొనసాగిస్తోంది. పలు థియేటర్లలో 100 రోజుల తర్వాత కూడా ఈ చిత్రం ప్రదర్శితవుతోంది. ఈ చిత్రం తమిళ రీమేక్ సైతం ఇటీవల విడుదలై అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. మరిన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్ను నిర్మాత ఎన్.శ్యాంప్రసాద్ రెడ్డి హిందీలో మాత్రం రీమేక్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కొద్దికాలంగా మెయిన్ హీరోయిన్ కోసం ఆయన పలు పేర్లు పరిశీలుస్తున్నారు. తెలుగులో అనుష్క ద్విపాత్రాభినయం చేయగా, సోనూసూద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. తెలుగులో నటించిన అఘోరా పాత్రను సోనూసూద్ హిందీ వెర్షన్ లోనూ పోషించనున్నారు. కాగా, టైటిల్ పాత్ర కోసం అందాల నటి ఐశ్వర్యారాయ్ ను శ్యాంప్రసాద్ రెడ్డి తాజాగా సంప్రదిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తొలుత హిందీ నటి అనుష్క శర్మ పేరు పరిశీలనలోకి వచ్చిందనీ, అయితే ఆమె ఇప్పటికే ఒక సంస్థకు అగ్రిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఈ ఆఫర్ ను వదులుకుందనీ సమాచారం. హిందీ వెర్షన్ కు ఐశ్వర్య అయితేనే సరిగా ఉంటుందని పలువురు సూచించిన నేపథ్యంలో ఆమెను ఒప్పించేందుకు శ్యాంప్రసాద్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'యంతిరిన్' (రోబో) షూటింగ్ లో రజనీకాంత్ తో కలిసి ఐశ్వర్యారాయ్ పాల్గొంటున్నారు. మణిరత్నం 'రావణ్'లోనూ ఐశ్వర్య నటిస్తోంది. వీటికి తోడు పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'అరుంధతి' చిత్రానికి ఆమె కాల్షీట్లు ఎడ్జెట్ చేయాలగలరా ఆనేది వేచిచూడాల్సి ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్యాంప్రసాద్ రెడ్డితో కలిసి సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించేందుకు ఎంటర్ టైన మెంట్ జెయింట్ యాడ్ ల్యాబ్స్ ఆసక్తి కనబరుస్తోందని తెలిసింది.
News Posted: 6 May, 2009
|